రెండో రోజు ‘జనతా దర్బార్’ | Kejriwal holds janta darbar at AAP's office in Ghaziabad | Sakshi
Sakshi News home page

రెండో రోజు ‘జనతా దర్బార్’

Published Thu, Feb 19 2015 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

Kejriwal holds janta darbar at AAP's office in Ghaziabad

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గురువారం కూడా జనతా దర్బార్ నిర్వహించారు. కౌశంబీలోని ఆప్ కార్యాలయంలో ప్రజలను కలిసి వారి సమస్యలను విన్నారు. గంటన్న పాటు జరిగిన జనతా దర్బార్‌లో దాదాపు 500 మంది పాల్గొన్నారు. జనం ఉదయం 8 నుంచే  ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దర్బార్ ఉదయం 10 గంటలకు మొదలండంతో, పళ్లు , పూలమాలలు, మిఠాయిలతో వచ్చి కొందరు కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. మొదట వికలాంగులను కలిసిన కేజ్రీ, తరువాత ఐదుగురు పురుషులు, ఐదుగురు  మహిళల చొప్పున బృందాలుగా వచ్చిన వారితో సమావేశమయ్యారు. 11.30 గంటలకు కేజ్రీవాల్ బయటకు వచ్చి ముఖ్యమైన సమావేశానికి హాజరుకావలసిఉన్నందున తాను బయలుదేరుతున్నానని చెప్పారు. తనను కలవలేకపోయినవారు అధికారులకు తమ పత్రాలు ఇచ్చి వెళ్లాలని సూచించారు. ‘ నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మీ సమస్యలు పరిష్కరిస్తాన్న నమ్మకంతోనే నన్ను ఎన్నుకున్నారు. పత్రాలు అధికారులకు ఇచ్చి వెళ్లండి.’ అని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
 నిరాశ చెందిన అభిమానులు
 కేజ్రీవాల్ తమను కలవకుండా వెళ్లిపోవడం కొందరికి నిరాశ కలిగించింది. ‘నా సమస్యలు కేజ్రీవాల్‌కే చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఇంత దూరం వచ్చాను. కానీ ఆయన కలవలేకపోవడం బాధించింది.’ అని ద్వారకా నుంచి వచ్చిన మనోజ్‌కుష్వాహా ఆవేదన వ్యక్తం చేశారు. వెనుక గేటు గుండా వీఐపీలు వచ్చి కేజ్రీవాల్‌ను కలిశారని కొందరు ఫిర్యాదుచేశారు. ‘సీఎం నాసమస్య విన్నారు. అయితే ఉద్యోగం ఇవ్వలేనని, వసతి అవసరాలను తీర్చేడానికి ఏదైనా చేస్తానని హామీ ఇచ్చారు.’ అని దష్టిలోపం కలిగిన 45 ఏళ్ల ప్రేమ్ కుమార్ చెప్పారు . అయితే ‘ప్రజల నుంచి ఫిర్యాదు పత్రాలను స్వీకరించాం. పరిష్కారం కోసం వాటిని సంబంధిత అధికారులకు పంపుతాం’ అని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి అమిత్ చాబ్రియా చెప్పారు.
 
 దర్బార్‌కు పటిష్ట భద్రత
 జనతా దర్బార్ కోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం చుట్టూ మూడంచెల భద్రతావ్యవస్థను ఏర్పాటుచేశారు. ‘ముఖ్యమంత్రి వికలాంగులను మొదట కలవాలన్న కోరారు. అందువల్ల వారు ఏ సమసయంలో వచ్చారన్న వివక్ష పాటించకుండా ఆయనను కలిసే ఏర్పాటుచేశాం’ అని కేజ్రీవాల్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన గాజియాబాద్ నగర మెజిస్ట్రేట్ కపిల్‌సింగ్ చెప్పారు. అలాగే బుధ, గురు, శుక్రవారాల్లో ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు  సీఎం ప్రజలను కలుస్తారని ఆప్ కార్యకర్తలు చెప్పారు.
 
 కేజ్రీవాల్ రాజు కాదు
 కేజ్రీవాల్ ప్రజలను కలిసే సమావేశాలను జనతాదర్బార్‌గా పేర్కొనడంపై మాజీ మంత్రి మాలవీయనగర్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతీ అభ్యంతరం వ్యక్తం చేశారు. జనతా దర్బార్ అంటే రాజు ప్రజలను కలిసినట్లుగా ఉందని, కానీ కేజ్రీవాల్ రాజు కారని, ఆయన ప్రజలలో ఒకరని సోమ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఆయన బ్రహ్మకుమారీతో కలసి సీఎంతో సమావేశమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement