కేసీఆర్.. మా ఉద్యమానికి అండగా ఉండండి
తిరుమల :
తెలంగాణ సీఎం కేసీఆర్ను తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తిరుమలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నో ఏళ్లుగా తెలుగు భాష కోసం తాము చేస్తున్న పోరాటానికి కేసీఆర్ సహకారం కోరడానికి తమిళనాడు నుంచి కేతిరెడ్డితో పాటూ పెద్ద ఎత్తున తెలుగు అభిమానులు తరలివచ్చారు. తమిళనాడులో రద్దు చేసిన తెలుగు భాష పునరుద్ధరణ కోసం కృషి చేయాలని కేసీఆర్‌ను కేతిరెడ్డి కోరారు. తాము చేస్తున్న ఉద్యమానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై చర్చించడానికి తెలుగు సంఘాల నాయకులు హైదరాబాద్‌కు రావాలని కేసీఆర్ వారితో అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఉద్యమం, జల్లికట్టు ఉద్యమం కన్నా ఎంతో బలమైనదని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత కూడా మద్దతు తెలపడం వారి ఉద్యమ స్పూర్తికి నిదర్శనమన్నారు. తమిళనాడులోని తెలుగు వారికి స్పూర్తి కలిగించాలని కోరటానికి వచ్చామని, అందులో భాగంగా ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేయడానికి తమిళనాడు నుంచి తెలుగు అభిమానులు తరలివచ్చారని తెలిపారు.