ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి
అమరావతి( వెలగపూడి) :
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి చెన్నైలోని పొట్టి శ్రీరాములు హాల్కు పొట్టి శ్రీరాములు ఆంధ్ర భవన్ అని పేరుపెట్టాలని వినతి పత్రం సమర్పించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.
తొలి తెలుగు స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పెట్టించాలని కోరారు. ఉయ్యాలవాడను జాతీయ వీరుడుగా గుర్తించాలన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరితీసిన జుర్రటివాగు ప్రాంతంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు.
డ్రగ్స్ వాడేవారు, అమ్మే వారిపై దేశ ద్రోహ కేసులు పెట్టి శిక్షించేలా చట్టాలు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు సంబంధం ఉన్న సన్నివేశాలు చలనచిత్రాల్లో వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
తమిళనాడులో ఆక్రమణకు గురైన ఆంధ్రప్రదేశ్కి చెందిన మిగతా సదావర్తి భూములను తిరిగి వసూలు చేసేలా తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటూ మంత్రి నారా లోకేష్ను కూడా కలిసి ఆయన దృష్టికి కూడా ఈ సమస్యలను తీసుకువచ్చారు.