
సిద్ధరామయ్యతో ఖర్గే భేటీ
క్యాంపు కార్యాలయం కృష్ణాలో సమావేశం
సాక్షి, బెంగళూరు: లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో మల్లికార్జున ఖర్గే, సీఎం సిద్ధరామయ్యతో శనివారం ఉదయం సమావేశమై అరగంటకు పైగా చర్చించారు. ఏసీబీ ఏర్పాటు పై విపక్షాలతో పాటు స్వపక్ష ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. మంత్రి మండలి విస్తరణ, కేపీసీసీ అధ్యక్షుడి మార్పు, ఏసీబీ ఏర్పాటు తదిరత విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఈ భేటీ అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.....ఏసీబీ ఏర్పాటుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎలాంటి వివరణ కోరలేదని తెలిపారు. 15 రాష్ట్రాల్లో ఇప్పటికే ఏసీబీ పనిచేస్తోందని, అందులో భాగంగానే కర్ణాటకలోనూ ఏసీబీని ఏర్పాటు చేశారని చెప్పారు. ఏసీబీ ఏర్పాటు వల్ల లోకాయుక్త బలహీనపడుతుందనడంలో నిజం లేదని అన్నారు. ఈ విషయంపై స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే వివరణ ఇచ్చారని తెలిపారు. ఏసీబీ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి, జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామిలు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన మాట వాస్తవమేనని అయితే ఈ విషయంపై సోనియాగాందీ ఎలాంటి వివరణ కోరలేదని పేర్కొన్నారు. ఏసీబీ ఏర్పాటు వల్ల లోకాయుక్త బలహీనపడుతుందని ప్రతిపక్షాలు భావిస్తే ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని అన్నారు.