బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లను భావోద్వేగానికి గురి చేశారు. కర్ణాటక కలబురగి ఖర్గే సొంత జిల్లా. ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. ఒక వేళ మీరు పార్టీకి ఓటు వేసేందుకు ఇష్టపడకపోతే.. మీకోసం నేను పనిచేశానని భావిస్తే కనీసం మీరు నా అంత్యక్రియలకైనా హాజరు కావాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు.
2009, 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కలబురగిలో మల్లికార్జున్ ఖర్గే ఓడిపోయారు. అయితే ఈ సారి ఎన్నికల్లో కలబురగి నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని కాంగ్రెస్ అధిష్టానం పోటీకి దింపింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉమేష్ జాదవ్ మరోసారి టికెట్ దక్కించుకున్నారు.
ఈ తరుణంలో జిల్లాలోని అఫ్జల్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈసారి మీ ఓటు తప్పితే (కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే) నాకు ఇక్కడ స్థానం లేదని, మీ హృదయాన్ని గెలవలేనని అనుకుంటాను' అని ఖర్గే అన్నారు.
మీరు మాకు (కాంగ్రెస్‌కు) ఓటు వేసినా వేయకపోయినా, కలబురగికి నేను మంచి చేశానని మీరు భావిస్తే కనీసం నా అంత్యక్రియలకైనా రండి అని కాంగ్రెస్ చీఫ్ కోరారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను ఓడించేందుకు తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. నేను రాజకీయాల కోసమే పుట్టాను. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకున్నా.. ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా చివరి శ్వాస వరకు కృషి చేస్తాను. రాజకీయాల నుంచి విరమించుకోనని ఖర్గే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment