ongress party
-
‘పార్టీకి వేయండి.. లేదంటే నా అంత్యక్రియలకైనా రండి’.. ఖర్గే ఎమోషనల్
బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లను భావోద్వేగానికి గురి చేశారు. కర్ణాటక కలబురగి ఖర్గే సొంత జిల్లా. ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. ఒక వేళ మీరు పార్టీకి ఓటు వేసేందుకు ఇష్టపడకపోతే.. మీకోసం నేను పనిచేశానని భావిస్తే కనీసం మీరు నా అంత్యక్రియలకైనా హాజరు కావాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. 2009, 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కలబురగిలో మల్లికార్జున్ ఖర్గే ఓడిపోయారు. అయితే ఈ సారి ఎన్నికల్లో కలబురగి నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని కాంగ్రెస్ అధిష్టానం పోటీకి దింపింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉమేష్ జాదవ్ మరోసారి టికెట్ దక్కించుకున్నారు. ఈ తరుణంలో జిల్లాలోని అఫ్జల్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈసారి మీ ఓటు తప్పితే (కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే) నాకు ఇక్కడ స్థానం లేదని, మీ హృదయాన్ని గెలవలేనని అనుకుంటాను' అని ఖర్గే అన్నారు. మీరు మాకు (కాంగ్రెస్‌కు) ఓటు వేసినా వేయకపోయినా, కలబురగికి నేను మంచి చేశానని మీరు భావిస్తే కనీసం నా అంత్యక్రియలకైనా రండి అని కాంగ్రెస్ చీఫ్ కోరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఓడించేందుకు తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. నేను రాజకీయాల కోసమే పుట్టాను. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకున్నా.. ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా చివరి శ్వాస వరకు కృషి చేస్తాను. రాజకీయాల నుంచి విరమించుకోనని ఖర్గే స్పష్టం చేశారు. -
కెప్టెన్ గేమ్‌ప్లాన్ ఏమిటో..!
పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపివేయడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ గత ఏడాది నవంబరులో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)’గా తమ పార్టీకి నామకరణం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త), బీజేపీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాయని కమలదళం పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇటీవల ప్రకటించారు. కాంగ్రెస్‌లోని తన అనుయాయులను సొంత పార్టీలోకి లాగుతారని, ఎన్నికలు సమీపించేకొద్దీ... వలసలు పెరుగుతాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జంపింగ్‌లు మొదలయ్యాయి కానీ... ఆశ్చర్యకరంగా కెప్టెన్ అనుంగు అనుచరులు బీజేపీలోకి దూకేస్తున్నారు. ఇది పలువురి భృకుటి ముడిపడేటట్లు చేస్తోంది. అమరీందర్ గేమ్‌ప్లాన్ ఏమిటి? సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సింది పోయి ముఖ్య అనుచరులు బీజేపీలోకి వెళ్లడాన్ని ఎలా అనుమతిస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరెవరు వెళ్లారంటే.. మాజీ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి (గురుహర్ సహాయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే) డిసెంబరు 21న కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 67 ఏళ్ల గుర్మీత్ నాలుగుసార్లు ఎమ్మెల్యే. సెప్టెంబరు దాకా అమరీందర్ కేబినెట్లో క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. కెప్టెన్‌కు బాగా సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఈ కారణంగానే చన్నీ కేబినెట్లో ఈయనకు చోటివ్వలేదు. ఖాదియాన్ ఎమ్మెల్యే ఫతేజంగ్ బజ్వా, శ్రీహరిగోవింద్పూర్ ఎమ్మెల్యే బల్విందర్ సింగ్ లడీలు 22న కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బజ్వాకు కాంగ్రెస్ టిక్కెట్ రావడానికి అమరీందర్ సహాయపడ్డారు. ఇలా కెప్టెన్‌కు సన్నిహితులు కాషాయ కండువా కప్పుకోవడంతో... సమీప భవిష్యత్తులో అమరీందర్ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరూ ఉండరని, ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రధాని నరేంద్ర మోదీ పేరిటే ఎన్నికలకు వెళతామని షెకావత్ ప్రకటించారు. కూటమిలో బీజేపీయే పెద్దన్న పాత్ర పోషిస్తుందని, పంజాబ్ అసెంబ్లీలోని 117 స్థానాల్లో సగానికి పైగా తామే పోటీచేస్తామని షెకావత్ ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చినా... అమరీందర్ శిబిరం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. కాంగ్రెస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నష్టపర్చడమే ఈ 79 ఏళ్ల పాటియాలా రాజవంశ వారసుడి ప్రథమ లక్ష్యమని, అందుకే బీజేపీ అభీష్టం మేరకే నడుచుకుంటున్నారనే వాదన ఉంది. పరస్పర అవగాహనతోనేనా..! కెప్టెన్ పార్టీని బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలను లోక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రిన్స్ ఖుల్లర్ తోసిపుచ్చారు. బీజేపీకి పట్టున్న పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీచేయాలనుకున్న వారు కాషాయదళంలోకి వెళుతున్నారని.. అమరీందర్‌తో సంప్రదించే చేరికలు జరుగుతున్నాయని ఖుల్లర్ చెప్పారు. రాణా గుర్మీత్ సోధి ఫిరోజ్‌పూర్ నుంచి, ఫతేజంగ్ బజ్వా హిందూ బెల్ట్ నుంచి బరిలోకి దిగాలని కోరుకున్నారని... ఇవి బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకున్న, చాలా ఏళ్లుగా ఆ పార్టీ పోటీచేస్తున్న సీట్లు కావడంతో వారు అటువైపు మొగ్గు చూపారని తెలిపారు. ఈయన మాటలను బట్టి చూస్తుంటే... పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూనే అంతిమంగా కూటమికి లబ్ధి చేకూరేలా అమరీందర్, బీజేపీలు అవగాహనకు వచ్చినట్లు కనపడుతోంది. సన్నిహితులు ’సేఫ్‌జోన్’ను (విజయావకాశాలు మెండుగా ఉన్న స్థానాల నుంచి) కోరుకోవడం... ఏ పార్టీలో ఉన్నా తన మనుషులే, కూటమి ఎమ్మెల్యేలుగానే ఉంటారనే లెక్కతో కెప్టెన్ వీరికి పచ్చజెండా ఊపి ఉండొచ్చు. గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని కూటమి భాగస్వామ్యపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయని, అదే సమయంలో సంప్రదాయ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని పార్టీలకు నియోజకవర్గాల కేటాయింపు జరగాలని కోరుకుంటున్నాయని పీఎల్సీ అధికార ప్రతినిధి ఖుల్లర్ చెప్పారు. ఎవరికెన్ని సీట్లనేది ఇంకా ఖరారు కానున్నా... పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త) పార్టీలు గ్రామీణ నియోజకవర్గాల నుంచి, బీజేపీ పట్టణ ప్రాంతాల్లోని స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయవర్గాల సమాచారం. 2017లో జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తులో భాగంగా 23 చోట్ల పోటీచేసి మూడింటిలో మాత్రమే నెగ్గిన బీజేపీ.. కెప్టెన్ అండతో ఈసారి గట్టికూటమిని ఏర్పాటు చేసింది. పంజాబ్ ఎన్నికలను ఈ కొత్త కూటమి చతుర్ముఖ (శిరోమణి అకాలీదళ్– బీఎస్పీ కూటమి, కాంగ్రెస్, ఆప్‌లు మిగతా మూడు) పోరుగా మార్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
జంప్‌జిలానీలు వీరే..
హైకమాండ్‌కు 30 మందితో జాబితా పంపిన పీసీసీ చీఫ్ బొత్స కర్నూలు, విశాఖ జిల్లాల్లో అత్యధికం 70 మంది వెళ్లిపోతారంటున్న లగడపాటి సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. సీమాంధ్రకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే ప్రకటించారు. ఈ మేరకు మొత్తం 30 మంది ఎమ్మెల్యేలతో కూడిన వలస జాబితాను ఇప్పటికే ఏఐసీసీకి పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలెవరు? ఏయే జిల్లాల్లో ఎంతమంది పార్టీ వీడుతారన్న విషయంపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ సాగుతోంది. వలసల జాబితాలో మొత్తం ఆరుగురు మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, అహ్మదుల్లా, గల్లా అరుణ కుమారి ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో కాంగ్రెస్‌ను వీడటం దాదాపుగా ఖాయమైందని పీసీసీ వర్గాల సమాచారం. ఇక జిల్లాలవారీగా చూస్తే కర్నూ లు, విశాఖపట్నం జిల్లాల నుంచి అత్యధికంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు పీసీసీ నేతలు అంచనాకొచ్చారు. గంటాతోపాటు అవంతి శ్రీనివాసరావు (భీమిలి), వెంకట్రామయ్య(గాజువాక), ముత్యాలపాప (నర్సీపట్నం) విశాఖ నుంచి వెళ్లే వలస జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు తైనాల విజయకుమార్ పేరు కూడా (విశాఖ నార్త్) ప్రచారంలో ఉంది. కర్నూలు జిల్లాలో టీజీ, ఏరాసులతోపాటు శిల్పామోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి కూడా పార్టీ వీడతారని ప్రచారంలో ఉన్నప్పటికీ పీసీసీ ధ్రువీకరించలేదు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం బొత్స వ్యాఖ్యలతో విభేదించారు. కాంగ్రెస్ నుంచి ఏకంగా 70 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్నారని ఆయన విజయవాడలో చెప్పారు. వీరిలో ఎక్కువమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు వెళ్లాలని ఆసక్తి చూపుతుండగా... అక్కడ అవకాశం లేనివారికి టీడీపీ గాలం వేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జిల్లాలవారీగా ఎవరెవరు పార్టీని వీడుతున్నారనే అంశంపై పీసీసీ వర్గాలు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), జుట్టు జగన్నాయకులు (పలాస), మీసాల నీలకంఠంనాయుడు(ఎచ్చెర్ల), సుగ్రీవులు(పాలకొండ), కొర్ల భారతి (టెక్కలి). వీరిలో ధర్మాన, సుగ్రీవులు మాత్రమే పార్టీని వీడతారని పీసీసీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. విజయనగరం: రాజన్నదొర (ఇప్పటికే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో అధికారికంగా చేరిపోయారు). విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావు(అనకాపల్లి), అవంతి శ్రీనివాసరావు (భీమి లి), చింతలపూడి వెంకట్రామయ్య(గాజువాక), ముత్యాలపాప(నర్సీపట్నం), పి.రమేశ్‌బాబు(పెందుర్తి), యూవీ రమణమూర్తి (యలమంచిలి). వీరిలో రమేశ్‌బాబు, ముత్యాలపాప పార్టీని వీడే అవకాశం లేదని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పుగోదావరి: తోట నరసింహం (జగ్గంపేట), తోట త్రిమూర్తులు (రామచంద్రాపురం), పంతం గాంధీమోహన్(పెద్దాపురం), వంగా గీత(పిఠాపురం). వీరిలో తోట నరసింహం, గీత వెళ్లే అవకాశమే లేదని పీసీసీ నాయకులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి: కొత్తపల్లి సుబ్బారాయుడు (నర్సాపురం), పి.రామాంజనేయులు (భీమవరం), ఈలి నాని (తాడేపల్లి గూడెం). కృష్ణా: జిల్లా నుంచి ఎవరూ వెళ్లే అవకాశమే లేదని పీసీసీ చెబుతుండగా.... వెల్లంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి పార్టీని వీడే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. గుంటూరు: కాసు కృష్ణారెడ్డి (నర్సారావుపేట), యర్రం వెంకటేశ్వరరెడ్డి (సత్తెనపల్లి), గాదె వెంకటరెడ్డి (బాపట్ల). వీరిలో ఇద్దరు మాత్రమే పార్టీని వీడతారని పీసీసీ వర్గాల సమాచారం. ప్రకాశం: అన్నె రాంబాబు (గిద్దలూరు), ఆదిమూలం సురేష్ (యర్రగొండపాలెం). నెల్లూరు: శ్రీధర కృష్ణారెడ్డి(నెల్లూరు సిటీ), ఆదాల ప్రభాకర్‌రెడ్డి (సర్వేపల్లి). చిత్తూరు: షాజహాన్ బాషా (మదనపల్లె), గల్లా అరుణకుమారి (చంద్రగిరి). వీరిలో గల్లా అరుణ కుమారుడు గల్లా జయదేవ్‌కు టీడీపీ లోక్‌సభ టిక్కెట్ దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. కడప: ఆదినారాయణరెడ్డి(జమ్మలమడుగు) ఇప్పటికే వైఎస్సార్ సీపీ లో చేరగా, వీరశివారెడ్డి(కమలాపురం) వలస జాబితాలో ఉన్నారు. కర్నూలు: టీజీ వెంకటేశ్ (కర్నూలు), ఏరాసు ప్రతాపరెడ్డి(శ్రీశైలం), కాటసాని రాంభూపాల్‌రెడ్డి(పాణ్యం), శిల్పామోహన్‌రెడ్డి(నంద్యా ల). ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డీ వెళతారనే ప్రచారం జరుగుతోంది. అనంతపురం: జేసీ దివాకర్‌రెడ్డి(తాడిపత్రి), మధుసూదన్‌గుప్తా (గుంతకల్). వీరిలో జేసీ పార్టీలోనే కొనసాగుతారని, ఆయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డి, కుమారుడు పవన్ తొలుత వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని ఆసక్తి చూపినప్పటికీ అక్కడ అవకాశం లేదని తేలడంతో దానికి బ్రేక్ పడింది. దాంతో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.