బెంగళూరు, న్యూస్‌లైన్: బెంగళూరు నగర శివార్లలోని కేంద్ర కారాగారం పరప్పన అగ్రహార జైలు నుంచి సైకో కిల్లర్ జయశంకర్ అలియాస్ శంకర్ పరారయ్యాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలు నుంచి సీరియల్ కిల్లర్ శంకర్ పరారీ కావ డం తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో 11 మంది జైలు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వరుసగా 42 హత్యలు, లైంగిక దాడులకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న శంకర్ జైలులోని ఆస్పత్రి సెల్‌లో శనివారం అర్ధరాత్రి నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడు.
బెల్ట్, రెండు జతల గ్లౌజులు, దుప్పటి ఉపయోగించి రెండు ప్రహరీలు దాటుకుని బయటకు వచ్చాడు. ఆ సమయంలో భారీ వర్షం రావడం, కరెంట్ పోవడం కూడా శంకర్‌కు అనుకూలించింది. 30 అడుగుల ఎత్తు ఉన్న గోడ ఎక్కి అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో గోడ ఎక్కి కిందకు దిగే సమయంలో నిందితుడు గాయపడటంతో గోడలపై రక్తపు మరకలు కూడా పడ్డాయి. విషయం తెలుసుకున్న జైలు అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
జైలు సూపరింటెండెంట్ వీరేంద్ర సింహా పరప్పన అగ్రహార పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్ పరారీ సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు బెంగళూరు- హొసూరు రోడ్డులోని చెక్‌పోస్టులలో తనిఖీలు చేపట్టారు. నిందితుడి కోసం కర్ణాటక, తమిళనాడు పోలీసులకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. శంకర్‌కు జైలు సిబ్బంది సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. 1997లో ప్రారంభమైన పరప్పన అగ్రహార జైలు నుంచి తప్పించుకున్న మొదటి దొంగ జయ శంకరే.
రాక్షసుడే ..!
తమిళనాడులోని సేలం జిల్లా యడప్పాడి గ్రామానికి చెందిన జయశంకర్ (38) ఇప్పటి వరకు అనేక మంది మహిళలపై లైంగికదాడులు చేసి దారుణంగా హత్య చేసి వారి దగ్గర ఉన్న నగలు, నగదు లూటీ చేసి పరారయ్యాడు. ఇప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఒక కేసు విషయంలో కానిస్టేబుళ్లు చిన్నస్వామి, రాజవేలు కలిసి ధర్మపురి నుంచి సేలం కోర్టుకు తీసుకు వెలుతున్న సమయంలో జయ శంకర్ బస్టాండ్‌లో తప్పించుకున్నాడు. ఆందోళన చెందిన కానిస్టేబుల్ చిన్నస్వామి సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 ఆగస్టు 23న తమిళనాడుకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఎం. జయమణిపై అత్యాచారం చేసి ఆమెను దారుణంగా హత్య చేశాడు. 2011 మార్చి 18న తమిళనాడులోని కోయంబత్తూరు జైలు నుంచి కోర్టుకు తీసుకు వెలుతున్న సమయంలో తప్పించుకున్నాడు.
కర్ణాటకలో చిక్కి ఇక్కడే ఎస్కేప్ :
కర్ణాటక చేరుకున్న జయ శంకర్ వరసగా మహిళలపై అత్యాచారం చేసి హత్యలు చేశాడు. 2012 మే 5న కర్ణాటకలోని బీజాపుర జళకి చెక్‌పోస్టు దగ్గర ఇతనిని పోలీసులు పట్టుకున్నారు. అప్పటి నుంచి పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. శనివారం తుమకూరు కోర్టు ముందు జయ శంకర్‌ను హాజరు పరిచారు. తరువాత ఇతనిని గట్టిబందోబస్తు మధ్య పరప్పన అగ్రహారకు తీసుకు వచ్చారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఎస్కేప్ అయ్యాడు. పోలీసు డ్రస్ మాయం కావడంతో అదే డ్రస్‌లో జయ శంకర్ తప్పించుకున్నాడని సమాచారం.
జైలు సిబ్బందిపై వేటు
జయ శంకర్ తప్పించుకోవడంతో 11 మంది జైలు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదివారం జైళ్ల శాఖ ఏడీజీపీ గగన్‌దీప్ ఆదేశాలు జారీ చేశారు. పరప్పన అగ్రహార జైలు ఏఎస్పీ సవిమఠ, జైలర్ మహంతేష్, మోహనత్ సహా మొత్తం 11 మందిని సస్పెండ్ చేశారు.