Psycho Shankar
-
సైకో శంకర్ ఆత్మహత్య
సాక్షి బెంగళూరు : మహిళలపై అత్యాచారం, వరుస హత్యలకు పాల్పడి ఇక్కడి పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న కిరాతక సైకో శంకర్ సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోని సేలంకు చెందిన శంకర్ అలియాస్ జై శంకర్ (37) సోమవారం అర్దరాత్రి భోజనం చేసే ప్లేట్‌ను పదునైన ఆయుధంగా మార్చుకుని గొంతుకోసుకున్నాడు. విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది హుటాహుటిన విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను మంగళవారం వేకువజామున మృతి చెందినట్లు జైలు అధికారులు తెలిపారు. నిత్యం జైలు జీవితం, కేసుల విచారణతో తీవ్రమనస్తాపానికి గురై తోటి ఖైదీలతో విచిత్రంగా ప్రవర్తించడంతో ఎవరూ అతడి వద్దకు వెళ్లేవారు కాదు. దీంతో జైశంకర్‌కు ప్రత్యేక సెల్ కేటాయించారు. పారిపోవడానికి ఒకసారి జైలు గోడ ఎక్కి కిందపడటంతో నడుం దెబ్బతింది. అప్పటి నుంచి బాధ భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైకో శంకర్... తమిళనాడు రాష్ట్రంలోని సేలం, ఈడప్పాడి గ్రామానికి చెందిన జై శంకర్ అలియాస్ శంకర్ లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. ఇతడికి వివాహమై ముగ్గురు పిల్లలు. వ్యభిచారమే వ్యసనంగా మారడంతో వేశ్య వాటికల్లో మహిళలను హత్య చేసి పారిపోయేవాడు. దీంతో వరుస హత్యలు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఒక్క తమిళనాడులోనే 20కి పైగా కేసులు ఇతనిమీద ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రలో కూడా ఇతను పైశాచికత్వాన్ని కొనసాగించాడు. 2009లో తమిళనాడులో మహిళా కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇలా పదికి పైగా అత్యాచారం, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయగా అతను తప్పించుకుని కర్ణాటకలోని చిత్రదుర్గకు చేరుకున్నాడు. అక్కడ కూడా హత్యలు, దోపిడీలకు పాల్పడ్డాడు. తుమకూరు, బళ్లారి, విజయపుర తదితర ప్రాంతాల్లో హత్యలు చేస్తూ పోలీసులను హడలెత్తించాడు. బళ్లారిలో జైశంకర్‌పై ఆరు హత్యాచారాలు, కేసులు నమోదైయ్యాయి. తుమకూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య కేసులు ఇతడిపై నమోదయ్యాయి. ఐదు భాషల్లో ప్రావీణ్యం.. శంకర్‌కు కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడేవాడు. భాష ద్వారానే మహిళలను పరిచయం చేసుకుని నమ్మించి హత్య చేసేవాడు. ఎస్కేప్ శంకర్ : జైలు నుంచి పారిపోవడం శంకర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఎంతో భారీభద్రత ఉన్న పరప్పన జైలు నుంచి శంకర్ ఉడాయిండచంతో ఇతనికి ఎస్కేప్ శంకర్ అనే పేరు వచ్చింది. 2009లో తమిళనాడు సేలం పోలీసుల నంచి తప్పించుకున్నాడు. అదే విధంగా 2011లో కోర్టు విచారణకు పోలీసులు శంకర్‌ను తరలిస్తుండగా పోలీసుల కన్నుగప్పి ఉడాయించాడు. చిత్రదుర్గలో హత్యాచారం కేసులో జైలు నుంచి శంకర్ పారిపోయాడు. 2013లో పరప్పన జైలు నుంచి పారిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. -
బెంగళూరు శివార్లలో సైకో శంకర్ అరెస్టు
సైకో కిల్లర్, వరుస లైంగిక దాడులకు పాల్పడిన జయశంకర్ (సైకో శంకర్)ను పోలీసులు బెంగళూరు శివార్లలో అరెస్టు చేశారు. అతడు పరప్పన జైలు నుంచి తప్పించుకున్న ఆరు రోజులకు పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. బెంగళూరు నగరానికి దక్షిణంగా 25 కిలోమీటర్ల దూరంలోని బొమ్మనహళ్లి వద్ద గల కుద్లుగేట్ వద్ద జయశంకర్ దొరికాడని, అతడిని అరెస్టు చేశామని బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. అత్యంత ఎత్తయిన గోడలున్న జైలు నుంచి అతడు ఎలా తప్పించుకోగలిగాడో ప్రశ్నిస్తామని, అతడికి ఎవరైనా నకిలీ తాళం చెవులతో సాయం చేశారేమో కనుక్కుంటామని ఆయన చెప్పారు. సైకో కిల్లర్, కర్ణాటకలో వరుస లైంగిక దాడులకు పాల్పడిన జయశంకర్ (సైకో శంకర్) పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి తప్పించుకోవడానికి జైలు అధికారులు, సిబ్బందే కారణమని తెలుస్తోంది. అతను 30 అడుగుల గోడ దూకి పారిపోలేదని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దర్జాగా జైలు ప్రధాన ద్వారం నుంచే బయటకు వెళ్లాడని పోలీసు అధికారులు భావిస్తున్నారు. సైకో శంకర్ ఆదివారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడని, పోలీసు దుస్తులు ధరించి 30 అడుగుల గోడదూకి పారిపోయాడనే కథనాలు వినిపించాయి. కానీ శంకర్ శనివారం రాత్రి 8 గంటల సమయంలో జైలు మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లాడని తోటి ఖైదీలు ఉప్పందించినట్లు సమాచారం. -
కిరాతకుడు సైకో శంకర్
బెంగళూరు, న్యూస్‌లైన్: బెంగళూరు నగర శివార్లలోని కేంద్ర కారాగారం పరప్పన అగ్రహార జైలు నుంచి సైకో కిల్లర్ జయశంకర్ అలియాస్ శంకర్ పరారయ్యాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలు నుంచి సీరియల్ కిల్లర్ శంకర్ పరారీ కావ డం తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో 11 మంది జైలు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వరుసగా 42 హత్యలు, లైంగిక దాడులకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న శంకర్ జైలులోని ఆస్పత్రి సెల్లో శనివారం అర్ధరాత్రి నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడు. బెల్ట్, రెండు జతల గ్లౌజులు, దుప్పటి ఉపయోగించి రెండు ప్రహరీలు దాటుకుని బయటకు వచ్చాడు. ఆ సమయంలో భారీ వర్షం రావడం, కరెంట్ పోవడం కూడా శంకర్‌కు అనుకూలించింది. 30 అడుగుల ఎత్తు ఉన్న గోడ ఎక్కి అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో గోడ ఎక్కి కిందకు దిగే సమయంలో నిందితుడు గాయపడటంతో గోడలపై రక్తపు మరకలు కూడా పడ్డాయి. విషయం తెలుసుకున్న జైలు అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జైలు సూపరింటెండెంట్ వీరేంద్ర సింహా పరప్పన అగ్రహార పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్ పరారీ సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు బెంగళూరు- హొసూరు రోడ్డులోని చెక్‌పోస్టులలో తనిఖీలు చేపట్టారు. నిందితుడి కోసం కర్ణాటక, తమిళనాడు పోలీసులకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. శంకర్‌కు జైలు సిబ్బంది సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. 1997లో ప్రారంభమైన పరప్పన అగ్రహార జైలు నుంచి తప్పించుకున్న మొదటి దొంగ జయ శంకరే. రాక్షసుడే ..! తమిళనాడులోని సేలం జిల్లా యడప్పాడి గ్రామానికి చెందిన జయశంకర్ (38) ఇప్పటి వరకు అనేక మంది మహిళలపై లైంగికదాడులు చేసి దారుణంగా హత్య చేసి వారి దగ్గర ఉన్న నగలు, నగదు లూటీ చేసి పరారయ్యాడు. ఇప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఒక కేసు విషయంలో కానిస్టేబుళ్లు చిన్నస్వామి, రాజవేలు కలిసి ధర్మపురి నుంచి సేలం కోర్టుకు తీసుకు వెలుతున్న సమయంలో జయ శంకర్ బస్టాండ్‌లో తప్పించుకున్నాడు. ఆందోళన చెందిన కానిస్టేబుల్ చిన్నస్వామి సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 ఆగస్టు 23న తమిళనాడుకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఎం. జయమణిపై అత్యాచారం చేసి ఆమెను దారుణంగా హత్య చేశాడు. 2011 మార్చి 18న తమిళనాడులోని కోయంబత్తూరు జైలు నుంచి కోర్టుకు తీసుకు వెలుతున్న సమయంలో తప్పించుకున్నాడు. కర్ణాటకలో చిక్కి ఇక్కడే ఎస్కేప్ : కర్ణాటక చేరుకున్న జయ శంకర్ వరసగా మహిళలపై అత్యాచారం చేసి హత్యలు చేశాడు. 2012 మే 5న కర్ణాటకలోని బీజాపుర జళకి చెక్‌పోస్టు దగ్గర ఇతనిని పోలీసులు పట్టుకున్నారు. అప్పటి నుంచి పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. శనివారం తుమకూరు కోర్టు ముందు జయ శంకర్‌ను హాజరు పరిచారు. తరువాత ఇతనిని గట్టిబందోబస్తు మధ్య పరప్పన అగ్రహారకు తీసుకు వచ్చారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఎస్కేప్ అయ్యాడు. పోలీసు డ్రస్ మాయం కావడంతో అదే డ్రస్‌లో జయ శంకర్ తప్పించుకున్నాడని సమాచారం. జైలు సిబ్బందిపై వేటు జయ శంకర్ తప్పించుకోవడంతో 11 మంది జైలు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదివారం జైళ్ల శాఖ ఏడీజీపీ గగన్‌దీప్ ఆదేశాలు జారీ చేశారు. పరప్పన అగ్రహార జైలు ఏఎస్పీ సవిమఠ, జైలర్ మహంతేష్, మోహనత్ సహా మొత్తం 11 మందిని సస్పెండ్ చేశారు.