సైకో కిల్లర్, వరుస లైంగిక దాడులకు పాల్పడిన జయశంకర్ (సైకో శంకర్)ను పోలీసులు బెంగళూరు శివార్లలో అరెస్టు చేశారు.
సైకో కిల్లర్, వరుస లైంగిక దాడులకు పాల్పడిన జయశంకర్ (సైకో శంకర్)ను పోలీసులు బెంగళూరు శివార్లలో అరెస్టు చేశారు. అతడు పరప్పన జైలు నుంచి తప్పించుకున్న ఆరు రోజులకు పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. బెంగళూరు నగరానికి దక్షిణంగా 25 కిలోమీటర్ల దూరంలోని బొమ్మనహళ్లి వద్ద గల కుద్లుగేట్ వద్ద జయశంకర్ దొరికాడని, అతడిని అరెస్టు చేశామని బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. అత్యంత ఎత్తయిన గోడలున్న జైలు నుంచి అతడు ఎలా తప్పించుకోగలిగాడో ప్రశ్నిస్తామని, అతడికి ఎవరైనా నకిలీ తాళం చెవులతో సాయం చేశారేమో కనుక్కుంటామని ఆయన చెప్పారు.
సైకో కిల్లర్, కర్ణాటకలో వరుస లైంగిక దాడులకు పాల్పడిన జయశంకర్ (సైకో శంకర్) పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి తప్పించుకోవడానికి జైలు అధికారులు, సిబ్బందే కారణమని తెలుస్తోంది. అతను 30 అడుగుల గోడ దూకి పారిపోలేదని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దర్జాగా జైలు ప్రధాన ద్వారం నుంచే బయటకు వెళ్లాడని పోలీసు అధికారులు భావిస్తున్నారు. సైకో శంకర్ ఆదివారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడని, పోలీసు దుస్తులు ధరించి 30 అడుగుల గోడదూకి పారిపోయాడనే కథనాలు వినిపించాయి. కానీ శంకర్ శనివారం రాత్రి 8 గంటల సమయంలో జైలు మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లాడని తోటి ఖైదీలు ఉప్పందించినట్లు సమాచారం.