∙సైకో శంకర్ (ఫైల్)
సాక్షి బెంగళూరు : మహిళలపై అత్యాచారం, వరుస హత్యలకు పాల్పడి ఇక్కడి పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న కిరాతక సైకో శంకర్ సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోని సేలంకు చెందిన శంకర్ అలియాస్ జై శంకర్ (37) సోమవారం అర్దరాత్రి భోజనం చేసే ప్లేట్‌ను పదునైన ఆయుధంగా మార్చుకుని గొంతుకోసుకున్నాడు. విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది హుటాహుటిన విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను మంగళవారం వేకువజామున మృతి చెందినట్లు జైలు అధికారులు తెలిపారు. నిత్యం జైలు జీవితం, కేసుల విచారణతో తీవ్రమనస్తాపానికి గురై తోటి ఖైదీలతో విచిత్రంగా ప్రవర్తించడంతో ఎవరూ అతడి వద్దకు వెళ్లేవారు కాదు. దీంతో జైశంకర్‌కు ప్రత్యేక సెల్ కేటాయించారు. పారిపోవడానికి ఒకసారి జైలు గోడ ఎక్కి కిందపడటంతో నడుం దెబ్బతింది. అప్పటి నుంచి బాధ భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సైకో శంకర్...
తమిళనాడు రాష్ట్రంలోని సేలం, ఈడప్పాడి గ్రామానికి చెందిన జై శంకర్ అలియాస్ శంకర్ లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. ఇతడికి వివాహమై ముగ్గురు పిల్లలు. వ్యభిచారమే వ్యసనంగా మారడంతో వేశ్య వాటికల్లో మహిళలను హత్య చేసి పారిపోయేవాడు. దీంతో వరుస హత్యలు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఒక్క తమిళనాడులోనే 20కి పైగా కేసులు ఇతనిమీద ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రలో కూడా ఇతను పైశాచికత్వాన్ని కొనసాగించాడు. 2009లో తమిళనాడులో మహిళా కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇలా పదికి పైగా అత్యాచారం, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయగా అతను తప్పించుకుని కర్ణాటకలోని చిత్రదుర్గకు చేరుకున్నాడు. అక్కడ కూడా హత్యలు, దోపిడీలకు పాల్పడ్డాడు. తుమకూరు, బళ్లారి, విజయపుర తదితర ప్రాంతాల్లో హత్యలు చేస్తూ పోలీసులను హడలెత్తించాడు. బళ్లారిలో జైశంకర్‌పై ఆరు హత్యాచారాలు, కేసులు నమోదైయ్యాయి. తుమకూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య కేసులు ఇతడిపై నమోదయ్యాయి.
ఐదు భాషల్లో ప్రావీణ్యం..
శంకర్‌కు కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడేవాడు. భాష ద్వారానే మహిళలను పరిచయం చేసుకుని నమ్మించి హత్య చేసేవాడు.
ఎస్కేప్ శంకర్ : జైలు నుంచి పారిపోవడం శంకర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఎంతో భారీభద్రత ఉన్న పరప్పన జైలు నుంచి శంకర్ ఉడాయిండచంతో ఇతనికి ఎస్కేప్ శంకర్ అనే పేరు వచ్చింది. 2009లో తమిళనాడు సేలం పోలీసుల నంచి తప్పించుకున్నాడు. అదే విధంగా 2011లో కోర్టు విచారణకు పోలీసులు శంకర్‌ను తరలిస్తుండగా పోలీసుల కన్నుగప్పి ఉడాయించాడు. చిత్రదుర్గలో హత్యాచారం కేసులో జైలు నుంచి శంకర్ పారిపోయాడు. 2013లో పరప్పన జైలు నుంచి పారిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment