ముద్దు.. వద్దు | Kiss of Love program does not grant permission to any situation | Sakshi
Sakshi News home page

ముద్దు.. వద్దు

Published Wed, Nov 26 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

ముద్దు.. వద్దు

ముద్దు.. వద్దు

‘కిస్’కు అనుమతివ్వబోమని స్పష్టం చేసిన నగర పోలీసు  కమిషనర్
 
బెంగళూరు :  కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి ఎలాంటి పరిస్థితిలో అనుమతి ఇచ్చేది లేదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తేల్చిచెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ సంసృతి ప్రకారమే కాకుండా ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం బహిరంగ స్థలాలలో అశ్లీలంగా ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించు కోవడం నేరమని అన్నారు. ఈనెల 30వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడి టౌన్‌హాల్ దగ్గర కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని రచిత తనేజా ఇప్పటికే అర్జీ సమర్పించారని అన్నారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో ఎంత మంది పాల్గొంటారు.. వారు ఎక్కడి నుంచి వస్తున్నారో.. తదితర వివరాలు ఆ అర్జీలో లేవని ఎంఎన్  రెడ్డి అన్నారు. అయితే లవ్ ఆఫ్ కిస్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వ రాదని ఇప్పటికే పలు సంఘ, సంస్థలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు.

కేరళ, ఢిల్లీలో జరిగిన కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలకు భంగం కలగరాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కాగా, కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తామ ఎలాగైనా అడ్డుకుంటామని చట్టానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడిన శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్‌కు నోటీసులు జారీ చేశామని  అన్నారు. కిస్ ఆఫ్ లవ్  కార్యక్రామన్ని నిర్వహించినా, ఆ సమయంలో అడ్డుకోడానికి ఎవరైనా ప్రయత్నించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా తమ పని తాము చేసుకుని వెళ్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్, బెంగళూరు కేంద్ర విభాగం డీసీపీ సందీప్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement