
విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)
ఆసీస్ మీడియా మాత్రం పనిగట్టుకోని కోహ్లిపై నిందలు..
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన దూకుడును తగ్గించుకోవాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ అన్నాడు. దూకుడు లేని కోహ్లి కోరల్లేని పులితో సమానమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ సందర్భంగా ఆ జట్టు సారథి టీమ్ పైన్-కోహ్లి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కోహ్లిని తప్పుబడుతూ.. ఆసీస్ మీడియా దుమ్మెత్తిపోసింది. ఈ నేపథ్యంలో కోహ్లికి మద్దతుగా ఈ మాజీ క్రికెటర్ నిలిచాడు. ఆసీస్‌గడ్డపై కోహ్లి పోరాటం సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
'పులి అడవిలోనే ఉండాలి. కానీ బోన్లో కాదు. అదే విధంగా కోహ్లి కూడా మైదానంలో దూకుడుగానే వ్యవహరించాలి. అది అతని స్వభావం. అదే మాత్రం తగ్గినా కోహ్లిలో ఉండే పవర్ తగ్గిపోతుంది. పులి బోన్లో ఉంటే దాని పవర్‌ను చూపించలేదు. కోహ్లి విషయంలో కూడా ఇంతే. దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. రెండో టెస్టులో కోహ్లి ఎలా ఉన్నాడో మూడో టెస్టులోనూ అలానే ఉండాలి. ఒకవేళ కోహ్లి తన దూకుడుతో హద్దులు దాటితే అతని మ్యాచ్ ఫీజులో కోత విధించండి. అంతేకానీ ఆ దూకుడునే తగ్గించుకోమనడం సరికాదు. దీని ప్రభావం భారత్ విజయాల మీద పడుతుంది. పెర్త్ వేదికగా ఏం జరిగిందో నిజనిజాలు తెలుసుకోవాలి కానీ ఒకర్నే నిందించడం సబబు కాదు. ఒకప్పుడు ఆసీస్ ఆటగాళ్లు సైతం ఇలా ప్రవర్తించిన వాళ్లే. దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి' అని అన్నారు.
ఇక ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ సైతం ఆ మాటల యుద్దం ఆటలో భాగమేనని, రెండు బలమైన జట్లు విజయం కోసం ఆరాటపడుతున్నప్పుడు ఇలాంటి చిన్నచిన్న ఘటనలు చోటుచేసుకోవడం సహజమని చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి దూకుడుగానే వ్యవహరించాలని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్, పాకిస్తాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్‌లు సైతం అభిప్రాయపడ్డారు. కానీ ఆసీస్ మీడియా మాత్రం పనిగట్టుకోని కోహ్లిపై నిందలు వేస్తూ కథనాలు ప్రచురిస్తోంది. అతన్ని మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది.