ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తేనే వారి సత్తా బయటపడుతుందని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అన్నాడు. ప్రతిభను గుర్తించడం ఎంత ముఖ్యమో.. సరైన సమయంలో జట్టుకు ఎంపిక చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నాడు. అప్పుడే సెలక్టర్లు తమ పాత్రకు న్యాయం చేసిన వాళ్లవుతారని అభిప్రాయపడ్డాడు.
సెహ్వాగ్‌ను కాదని ధావన్‌ను ఆడించా
శిఖర్ ధావన్ అరంగేట్రం విషయంలో తన అంచనా తప్పలేదని.. తన నిర్ణయం సరైందేనని గబ్బర్ నిరూపించాడని సందీప్ పాటిల్ ఈ సందర్భంగా వెల్లడించాడు. సహచర నలుగురు సెలక్టర్లు వ్యతిరేకించినా.. నాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను కాదని ధావన్‌ను తుదిజట్టుకు ఎంపిక చేసిన విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా 2013లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వరుసగా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు.
అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు
ఈ క్రమంలో మూడో టెస్టులో వీరూ భాయ్‌పై వేటు వేసిన సెలక్టర్లు ధావన్‌కు టెస్టు అరంగేట్రం అవకాశం కల్పించారు. అయితే, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం 85 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
ఇక ఆసీస్‌తో మూడో టెస్టులో మొత్తంగా 174 బంతులు ఎదుర్కొన్న గబ్బర్.. 187 పరుగులతో అదరగొట్టాడు. ఆ తర్వాత టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ మొహాలీ హ్యారికేన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘యువ క్రికెటర్లు ఫామ్‌లో ఉన్నపుడే వారికి అవకాశాలు ఇవ్వాలి.
నన్ను కాపాడాడు
సరైన సమయంలో పిలుపునిస్తేనే వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆ సమయంలో శిఖర్ సౌతాఫ్రికా టూర్‌లో ఇండియా-ఏ తరఫున డబుల్ సెంచరీ, సెంచరీ బాదాడు. అప్పుడు అతడిని జాతీయ జట్టుకు ఆడించాలని నేను భావించాను. సెహ్వాగ్‌ను కాదని.. ధావన్‌ను ఆడించాలనే నా నిర్ణయాన్ని నా సహచర సెలక్టర్లు వ్యతిరేకించారు.
అయితే, ఆ తర్వాత వారిని ఒప్పించగలిగాను. అలా శిఖర్ జట్టులోకి వచ్చి తొలి టెస్టులోనే రికార్డు సెంచరీ బాదాడు. నా నిర్ణయం సరైందని నిరూపించాడు. అయినా.. నేనేమీ క్రెడిట్ తీసుకోవాలనుకోలేదు.
నిజానికి శిఖర్ శతకం చేసి ఒకరకంగా నన్ను రక్షించాడనుకోండి(నవ్వుతూ)’’ అంటూ గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు. కాగా సందీప్ పాటిల్ టీమిండియా తరఫున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడాడు. 2012- 2016 మధ్య బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా పనిచేశాడు.
చదవండి: Duleep Trophy: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లపైనే!
Comments
Please login to add a commentAdd a comment