మెగా టోర్నీలైన ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లకు ముందు టీమిండియాను చాలా సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వీటిలో తుది జట్టు కూర్పు ప్రధానమైన సమస్యగా ఉంది. మరి ముఖ్యంగా ఓపెనర్ల సమస్య టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఎక్కువగా వేధిస్తుంది. రోహిత్‌కు జతగా ఎవరిని బరిలోకి దించాలని యాజమాన్యం పెద్దలు తలలుపట్టుక్కూర్చున్నారు.
ఈ విషయమై స్టార్‌స్పోర్ట్స్ ఛానల్ ఎక్స్‌పర్ట్స్ ప్యానెల్‌లో డిస్కషన్ జరగ్గా ఇద్దరు భారత మాజీల మధ్య వాడివేడి చర్చ సాగింది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. రోహిత్‌కు జతగా ఇషాన్ కిషన్‌కు పంపాలని ప్రతిపాదించగా.. భారత మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ శుభ్‌మన్ గిల్‌కు వత్తాసు పలికాడు.
తాజాగా విండీస్‌తో ముగిసిన సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను ఆసియా కప్ తుది జట్టులో ఓపెనర్‌గా ఆడించాలని రవిశాస్త్రి వాధిస్తే.. మూడు ఫార్మాట్లలో ఫామ్‌ను, అలాగే కంసిస్టెన్సీని పరిగణలోకి తీసుకుని శుభ్‌మన్ గిల్‌కు ఆ స్థానంలో అవకాశం ఇవ్వాలని సందీప్ పాటిల్ సూచించాడు. శాస్త్రి లెక్క ప్రకారం లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతుందని అంటే.. రోహిత్ లెఫ్ట్ హ్యాండర్‌తో అంత కంఫర్టబుల్‌గా ఉండడని సందీప్ అన్నాడు.
ఇందుకు ప్రతిగా స్పందించిన శాస్త్రి.. గిల్‌ను పూర్తిగా జట్టును తప్పించమని చెప్పట్లేదని, అతన్ని 3 లేదా 4 స్థానాల్లో ఆడిస్తే మంచిదని తెలిపాడు. శాస్త్రి ఈ ప్రతిపాదనను తెరపైకి తెస్తూనే ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలో ఎవరి స్థానాలు పర్మనెంట్ కాదని పరోక్షంగా కోహ్లి, రోహిత్‌ల బ్యాటింగ్ స్థానాలపై కామెంట్ చేశాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని డిస్కషన్‌ను ముగించాడు.
రాహుల్, శ్రేయస్‌లతోనే తలనొప్పి..
కాగా, గాయాల నుంచి కోలుకుని ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించేందుకు బెంగళూరులోని ఎన్‌సీఏలో శ్రమిస్తున్న భారత స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. వీరిద్దరు ఆసియా కప్ టీమ్ సెలెక్షన్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారా లేదా అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. వీరి లేని లోటు ప్రస్తుతం భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.
ఒకవేళ వీరిరువురు ఆసియాకప్ టీమ్ సెలెక్షన్ సమయానికి కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోతే జట్టు కూర్పులో కీలక మార్పులు చేయాల్సి వస్తుంది. వీరికి ప్రత్యామ్నాయంగా సెలెక్టర్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌లను పరిశీలించవచ్చు. ఒకవేళ ఇషాన్‌ను ఫైనల్ చేస్తే, అతన్ని ఓపెనర్‌గా పంపాలా లేక మిడిలార్డర్‌లో ఆడించాలా అన్నది మరో సమస్యగా మారుతుంది. ఈ ప్రస్తావన నేపథ్యంలోనే రవిశాస్త్రి, సందీప్ పాటిల్ మధ్య వాడివేడి చర్చ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment