
ఎదురుదాడి!
అసంతృప్త వాదుల ఆరోపణలకు చెక్ పెట్టే రీతిలో ఎదురు దాడికి డీఎండీకే వర్గాలు సిద్ధమయ్యాయి. డీఎండీకే ట్రస్టుకు రూ.500 కోట్లు విరాళాల రూపంలో వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయా? ఉంటే కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధం అని ఆ పార్టీ కోశాధికారి కేఆర్ ఇలంగోవన్ సవాల్ చేశారు.
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతు, ఓటు బ్యాంక్ పతనం వెరసి డీఎండీకేను పీకల్లోతు కష్టాల్లో ముంచింది. ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు బయలు దేరాయి. పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ మీద అసంతృప్తి, అసహనంతో బయటకు వచ్చిన ముఖ్య నేతలందరూ డీఎంకే తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న విజయకాంత్ మీద తీవ్ర ఆరోపణలు సంధించే పనిలో పడ్డారు.
డీఎండీకే ట్రస్టులో ఉన్న రూ.ఐదు వందలు మింగేశారని, డీఎంకే చేతికి అధికారం దక్కకుండా చేయడం లక్ష్యంగా ప్రజా సంక్షేమ కూటమిలోకి వెళ్లినందుకు అన్నాడీఎంకే రూ.750 కోట్లు అప్పగించినట్టుగా తీవ్ర ఆరోపణలు చేయడం మొదలెట్టారు. ఇది కాస్త విజయకాంత్‌ను, ఆయన వెన్నంటి ఉన్న మరి కొందరు నేతల్లో తీవ్ర ఆవేదనను రేకెత్తించిన ట్టు సమాచారం. దీంతో పార్టీ నుంచి బయటకు వెళ్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించే వారిపై ఎదురుదాడికి డీఎండీకే వర్గాలు సిద్ధమయ్యాయి.
పార్టీని అడ్డం పెట్టుకుని బయటకు వెళ్లిన ఆయా నేతలు గతంలో ఏ మేరకు సంపాదించారో ఆ వివరాల్ని సేకరించడం, వారి పనితీరును టార్గెట్ చేసి తీవ్రంగా స్పందించేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం డీఎండీకే కోశాధికారి కేఆర్ ఇలంగోవన్ పేర్కొంటూ విజయకాంత్, పార్టీ మీద ఆధార రహిత ఆరోపణలు చేస్తూ ఉంటే, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
డీఎంకే ఇచ్చిన స్క్రిప్ట్‌తో డీఎండీకే మీద దుమ్మెత్తి పోయడం ఇకనైనా మానుకోవాలని, లేని పక్షంలో బయటకు వెళ్లిన వారందరి బండారం చిట్టా విప్పాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. విరాళాల రూపంలో డీఎండీకే ట్రస్టుకు రూ. ఐదు వందల కోట్లు వచ్చినట్టు, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. పార్టీ, ట్రస్టు వ్యవహారాల లెక్కలు వివరాలు ఆదాయపన్ను, ఎన్నికల కమిషన్, పార్టీ సర్వసభ్య సమావేశం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూనే ఉన్నట్టు పేర్కొన్నారు.
చౌక బారు విమర్శలు, ఆరోపణలు గుప్పించే ఈ నాయకులు పార్టీని అడ్డం పెట్టుకుని ఏ మేరకు సంపాదించారో? బయట పెట్టాలా..? అని మండి పడ్డారు. విజయకాంత్ మీదగానీ, పార్టీ మీదగానీ నిందలు వేస్తూ ఉంటే, కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ట్రస్టు నిధుల వ్యవహారంగా శ్వేత పత్రానికి సిద్ధమంటూ, కోర్టులోనూ తేల్చుకునేందుకు రెడీ అని వ్యాఖ్యానించడం గమనార్హం.