సుప్రీం ఆదేశాలు తుంగలోకి
- అక్రమ గనుల రద్దుపై ప్రభుత్వం నిర్లక్ష్యం
- బీజేపీ ఎమ్మెల్సీ కేఎస్ ఈశ్వరప్ప
సాక్షి, బళ్లారి : దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని బీజేపీ ఎమ్మెల్సీ కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. రాష్ట్రంలోని 51 అక్రమ గనుల కంపెనీలను రద్దు చేసి, వాటిని వేలం వేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసి ఏడాది పూర్తి అవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకుండా పోయిందని అన్నారు. ఆ 51 కంపెనీలు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలవి కావడం వల్లనే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక ఎస్‌పీ సర్కిల్ వద్ద బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో పేదలకు అందాల్సిన రూ.1కే కిలోబియ్యం ధనికుల పాలు అవుతోందని, ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. అత్యాచారాల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అత్యాచార ఘటనల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక చట్టం తీసుకువస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపినా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
రాష్ర్టంలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపంచే విషయంపై కాంగ్రెస్ పాలకులు దృష్టి సారించడం లేదని విమర్శించారు. సమష్టి కృషితో కాంగ్రెస్‌ను ఇంటి బాట పట్టిస్తామని అన్నారు. సమావేశంలో మాజీ డీసీఎం అశోక్, మాజీ మంత్రి గోవిందకారజోళ, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, మాజీ ఎంపీ శాంత తదితరులు పాల్గొన్నారు.