జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్
సాక్షి, బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామికు, అదే పార్టీకి చెందిన శాసనసభ్యుడు జమీర్ అహమ్మద్‌కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ‘ఆయనకు ఉర్దూ అర్థం కాదనుకుంటా’ అంటూ కుమారపై జమీర్ అహమ్మద్ వ్యంగాస్త్రాలు సంధించారు. చాలా సంవత్సరాలుగా బక్రీద్ సందర్భంగా చామరాజపేట ఈద్గామైదానంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో జమీర్ అహమ్మద్‌తో కలిసి కుమారస్వామి పాల్గొనేవారు.
అయితే సోమవారం నాడు నిర్వహించిన ప్రార్థనలకు కుమార స్వామి గైర్హాజరయ్యారు. ఈ విషయంపై మీడియాతో జమీర్ మాట్లాడుతూ... ‘సాముహిక ప్రార్థనల్లో పాల్గొనాల్సిందిగా నేను కుమారస్వామికి ఉర్థూలో లేఖ రాశాను. అయితే ఆయనకు ఉర్దూ అర్థం కాదనుకుంటా. అందుకే హాజరు కాలేదు.’ అని ఎద్దేవా చేశారు. గత నెల 3న బెంగళూరులో జరిగిన జేడీఎస్ శాసనసభ పక్షం సమావేశానికి జమీర్ అహమ్మద్ హాజరు కాకపోవడంతో ‘జమీర్ అహమ్మద్‌కు కన్నడ అర్థం కాదనుకుంటా. అందుకే కన్నడలో రాసిన ఆహ్వాన పత్రిక చదువలేకపోయారు. దీంతో శాసనసభ పక్షం సమావేశానికి హాజరుకాలేదు. అని కుమారస్వామి పేర్కొన్నారు. ఇందుకు ప్రతీకారంగానే జమీర్ అహమ్మద్ తాజాగా వ్యంగాస్త్రాలు వదిలారని తెలుస్తోంది.
కుమారస్వామికి ఉర్దూ అర్థం కాదనుకుంటా!
Published Tue, Oct 7 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement