= చెరకు రైతులకు అండగా ఉంటాం
= కేంద్ర సాయం కోసం త్వరలో ప్రతినిధి బృందంతో ఢిల్లీకి
= రైతుల కష్టాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్తా
= ఈ విషయంపై గతంలోనే కేంద్రానికి రెండు లేఖలు
= గిట్టుబాటు ధర నిర్ణయంలో చక్కెర ఫ్యాక్టరీల లాబీకి తలొగ్గం
= మండలిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కష్టాల్లో ఉన్న చెరకు రైతులను ఆదుకోవడంలో భాగంగా కేంద్ర సాయాన్ని కోరడానికి వచ్చే నెల ఆరో తేదీ తర్వాత ప్రతినిధి బృందంతో ఢిల్లీకి వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. చెరకు మద్దతు ధరపై శాసన మండలిలో జరిగిన చర్చకు శుక్రవారం ఆయన సమాధానమిచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌లను కలుసుకుని చెరకు రైతులకు అండగా నిలవాలని కోరనున్నట్లు చెప్పారు. చక్కెర ధర పతనం కావడంతో చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు సరైన మద్దతు ధర లేక రైతులు పడుతున్న కష్టాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళతామని వివరించారు.
చెరకు రైతుల కడగండ్లపై ఇదివరకే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్రం వద్దకు ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని వెల్లడించారు. రాష్ర్ట ప్రభుత్వం ఇదివరకే కేంద్రానికి రెండు లేఖలను రాస్తూ చెరకు రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరినట్లు చెప్పారు. చక్కెర దిగుమతి సుంకాన్ని ఐదు శాతం నుంచి 40 శాతానికి పెంచాలని, రాష్ట్రంలో నిల్వ ఉన్న 85 లక్షల టన్నుల చక్కెరకు సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
బకాయిల చెల్లింపు
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినప్పుడు చక్కెర కర్మాగారాలు చెరకు రైతులకు రూ.780 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉండేదని, ఇప్పటి వరకు రూ.748 కోట్లను చెల్లించేశారని తెలిపారు.
చక్కెర కర్మాగారాల యజమానులు మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ, చెరకు మద్దతు ధర నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. చక్కెర ఫ్యాక్టరీల లాబీకి ప్రభుత్వం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
టన్ను చెరకుకు మద్దతు ధరను రూ.3 వేలుగా నిర్ణయించాలన్న బీజేపీ సభ్యుల డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ‘వీరు అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్ చక్కెర ధర రూ.3,400గా ఉండేది. అప్పట్లో వారు చెరకు మద్దతు ధరను ఎందుకు పెంచలేదు’ అని నిలదీశారు. అంతకు ముందు బీజేపీ సభ్యులు మద్దతు ధరపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేశారు.