22 మంది యూపీ ఎంపీలపై ‘అనర్హత’ కత్తి
- మళ్లీ ఎన్నికైన 71 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు
- తిరిగి ఎన్నికైన 165 మంది ఎంపీల ఆస్తుల్లో భారీ పెరుగుదల
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 22 మంది ఎంపీలపై ‘అనర్హత’ కత్తి వేలాడుతోంది. ఈ ఎంపీలపై హత్యాయత్నం, కిడ్నాప్ వంటి తీవ్ర అభియోగాలపై కేసులు పెండింగులో ఉన్నాయి. రాజకీయ నేతలపై పెండింగ్ కేసుల విచారణను చార్జిషీట్ దాఖలు చేసిన ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో దిగువ కోర్టులను ఆదేశించింది. తమపై నమోదైన కేసుల్లో ఈ ఎంపీలు దోషులుగా తేలితే, వారిపై అనర్హత వేటు తప్పదు. ప్రస్తుత 16వ లోక్‌సభకు మళ్లీ ఎన్నికైన ఎంపీలు 165 మంది ఉండగా, వారిలో 71 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
వీరిలో 13 మందిపై కేసులు గత ఐదేళ్లలో పెరిగినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. గత లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించి, తిరిగి ఎన్నికైన 165 మంది ఎంపీల ఆస్తుల్లో ఈసారి భారీ పెరుగుదల నమోదైంది. 2009 నాటితో పోలిస్తే, 2014 నాటికి వారి ఆస్తులు 137 శాతం మేరకు పెరిగాయి.
బీజేపీ తరఫున ఎన్నికైన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా ఆస్తులైతే ఏకంగా 778 శాతం మేరకు పెరిగాయి. 2009 నాటికి ఆయన ఆస్తులు రూ.15 కోట్లు కాగా, 2014 నాటికి ఆయన ఆస్తులు రూ.131.74 కోట్లకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ఎంపీల సగటు ఆస్తులు 2009 నాటికి రూ.4.44 కోట్లు ఉండగా, 2014 నాటికి రూ.17.03 కోట్లకు చేరుకున్నాయి. కాగా, 16వ లోక్‌సభలో అత్యధికంగా 315 ఎంపీలు తొలిసారి కొలువుదీరనున్నారు.