వెంకన్న భక్తులకు ‘సమైక్య’ కష్టాలు
Published Mon, Oct 7 2013 2:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంటే తమిళనాడు వాసులకు మహాప్రీతి. ఆ దేవదేవుడిని కనులారా చూద్దామని లక్షలాదిగా తరలి వెళుతుంటారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా తమిళనాడు, సీమాంధ్ర మధ్య బస్సుసేవలు నిలిచిపోయాయి. మరోవైపు రైళ్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో భక్తులకు దిక్కుతోచడం లేదు.
సాక్షి, చెన్నై: ప్రత్యేక తెలంగాణ ప్రకటనతో సీమాంధ్రలో ఉద్యమం మొదలైంది. అక్కడి సెగ చెన్నై, వేలూరు, తిరువళ్లూరు, కృష్ణగిరి, ధర్మపురి తదితర రాష్ట్ర సరిహద్దు జిల్లాల్ని తాకింది. ఫలితంగా ప్రభుత్వ బస్సు సేవలు నిలిచిపోయాయి. ఎక్కడి బస్సులు అక్కడే ఆగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి రైలు ప్రయూణమే ఆధారమవుతోంది. అయితే అన్ని రైళ్లూ కిటకిటలాడుతున్నాయి.
భక్తులకు కష్టాలు
వెంకన్న బ్రహ్మోత్సవాలు తిలకించాలంటే రెండు కళ్లూ చాలవంటారు. అలాంటి బ్రహ్మోత్సవాలకు తమిళనాడు నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వెళ్లడం ఆనవాయితీ. స్వామివారి సేవలో తరించేందుకు పెద్దయెత్తున్న భజన బృందాలు ఇక్కడి నుంచే వెళతాయి. రామానుజం కుట్టుం అని పిలిచే ఈ బృందాలు ఆలయ మాడావీధుల్లో భజనలు చేస్తుంటాయి. స్వామివారి గరుడసేవకు చెన్నై నుంచి గొడుగులు, శ్రీవళ్లి పుత్తూరు నుంచి పూలమాల వెళ్లడం ఆనవాయితీ. అలాగే గోవింద మాల ధరించి వేలాది మంది పాదయాత్ర రూపంలో తిరుమలకు వెళుతుంటారు.
పస్తుతం సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. ఫలితంగా బ్రహ్మోత్సవాలు చూసే భాగ్యం ఎక్కడ కోల్పోతామోనని తమిళనాడులోని భక్తులు ఆందోళన చెందుతున్నారు. స్వామి మీదే భారం వేసి ముందుకు కదులుతున్నారు. బస్సులు లేకపోవడంతో రైళ్లపైనే ఆధారపడుతున్నారు. దీంతో తిరుపతి మీదుగా వెళ్లే సప్తగిరి, గరుడ ఎక్స్‌ప్రెస్, లోక్ ఎలక్ట్రిక్ రైళ్లు కిటకిటలాడుతున్నాయి. గోవింద మాల భక్తులు, ఇంకొందరు కాలినడకనే తిరుమలకు పయనమవుతున్నారు.
కోర్టులో పిటిషన్
వెంకన్న భక్తులు ఎదుర్కొంటున్న కష్టాల్ని గుర్తించిన చెన్నైకి చెందిన న్యాయవాది జ్ఞానశేఖరన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తిరుపతిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు తమిళనాడు నుంచి లక్షలాది మంది భక్తులు వెళతారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పాదయాత్ర రూపంలో, రైళ్ల ద్వారా అతికష్టం మీద తిరుపతికి వెళుతున్నారని వివరించారు. వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులకు తిరుపతిలో ఇబ్బందులు కలగకుండా గట్టి భద్రత కల్పించే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా పరిగణించిన మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్, సత్యనారాయణతో కూడిన బెంచ్ శనివారం సాయంత్రం విచారించింది. అయితే భక్తులపై దాడులు దిగిన సందర్భాలు లేవని బెంచ్ పేర్కొంది. ఈ దృష్ట్యా భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేమని పిటిషన్‌ను తిరస్కరించింది.
Advertisement
Advertisement