సమైక్య సెగతో 900 మెగావాట్ల విద్యుత్ నష్టం
Published Wed, Oct 9 2013 2:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
అన్నానగర్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం తమిళనాడు విద్యుత్ రంగాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. విద్యుత్ పంపకాల ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రానికి అందుతున్న 900 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చెన్నైతోపాటు ఇతర జిల్లాల్లో తిరిగి విద్యుత్ కోతలు ప్రారంభం కానున్నాయి. సోమవారం రవాణా వ్యవస్థను స్తంభింపచేసిన సమైక్య సెగ మంగళవారం విద్యుత్ రంగాన్ని కూడా తాకింది. ఆంధ్రాలోని సింహా ద్రి, రామగుండం పవర్ స్టేషన్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 900 మెగావాట్లను పంపక ఒప్పందం కింద తమిళనాడుకు తరలిస్తోంది.
ఈ సరఫరా సోమవారం నుంచి నిలిచిపోవడంతో రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా స్థాయి 3 వేల మెగావాట్ల నుంచి 2100 మెగావాట్ల స్థాయికి పడిపోయింది. రాష్ట్రానికి ఒడిశా (530 మెగావాట్లు), కర్ణాటక(227 మెగావాట్లు) నుంచి అందే పంపక విద్యుత్ స్థాయిలో 730 మెగావాట్లే ఉండడంతో బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి విద్యుత్ కోతను యధావిధిగా విధించే అవకాశాలున్నాయని రాష్ట్ర విద్యుత్ బోర్డు ముందస్తు హెచ్చరికలు చేసింది. గాలిమరల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ స్థాయి కూడా అంత అశాజనకంగా లేదని అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి వ్యవసాయ పంపు సెట్లకు మాత్రమే త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామని వివరించారు. ఈ నెలాఖరు వరకూ ఉద్యమ తీవ్రతను సమీక్షించిన అనంతరం నవంబర్ నుంచి పరిశ్రమలకు కూడా కోత విధించే ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రామగుండం-సింహాద్రిలో ఉత్పత్తి అవుతున్న రెండు వేల మెగావాట్ల విద్యుత్‌లో 900 మెగావాట్లను ఆంధ్రా ప్రభుత్వం తమకు ఇస్తోందని, సోమవారం నుంచి ఈ విద్యుత్ అందకపోవడంతో జల విద్యుత్‌పై దృష్టి పెట్టామని వివరించారు. మద్రాసు అటామిక్ పవరు స్టేషన్ల నుంచి అందే 300 మెగావాట్ల విద్యుత్ కొంతవరకూ లోటును పూడ్చగలదన్నారు. రాష్ట్రంలో ఏసీల వాడకం, వాటి సంఖ్య పెరగడం వల్ల అదనంగా 12,118 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోందన్నారు. ఏసీల వల్లే 269 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతోందని వివరించారు. సీమాంధ్ర ఉద్యమం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ ఉత్పత్తి 6090 మెగావాట్ల నుంచి 2990 మెగావాట్లకు తగ్గిపోయిందని, ఉద్యమం ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర రైల్వేల మీద సైతం ఈ ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదని విద్యుత్ బోర్డు అంటోంది.
మంత్రి అభయం
రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ సంక్షోభంలో ఉందని విద్యుత్ బోర్డు అధికారులు చెబుతున్నారు. చిన్నతరహా పరిశ్రమల సదస్సులో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ మాత్రం చిన్నతరహా పరిశ్రమలకు విద్యుత్ కోత విధించబోమని అభయం ఇచ్చారు. ఉత్పత్తి విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని పేర్కొన్నారు.
Advertisement
Advertisement