డ్రైవర్ కునుకు తీయడంతో విరుదునగర్ ఫోర్‌వే రోడ్డు రైల్వే బ్రిడ్ అడ్డుగోడను ఢీకొన్న లారీ వేలాడుతూ నిలబడింది.
కేకే.నగర్: డ్రైవర్ కునుకు తీయడంతో విరుదునగర్ ఫోర్‌వే రోడ్డు రైల్వే బ్రిడ్ అడ్డుగోడను ఢీకొన్న లారీ వేలాడుతూ నిలబడింది. 12 గంటల సుదీర్ఘ పోరాటం తరువాత క్రేన్ ద్వారా లారీని సురక్షితంగా వెలుపలకు లాగారు. లారీ, రైల్వే మార్గంలో పడిపోయేటట్లు నిలబడడంతో ఆ మార్గంలో వెళ్లే మదురై - సెంగోట్టై రైళ్ల రాకపోకలను నిలిపి వేశారు.
ఫోర్‌వేపై వాహనాల రాకపోకలను వేరే మార్గంలో మళ్లించారు. హైదరాబాద్ నుంచి నోటు పుస్తకాలతో తిరునెల్వేలికి వెళ్లే లారీ, శుక్రవారం ఉదయం విరుదునగర్ ఫోర్‌వే రోడ్డుపై గల రైల్వే వంతెన సమీపంలో వస్తోంది. డ్రైవర్ నిద్ర మత్తుతో ఉండడంతో లారీ ఫోర్‌వే ఇనుప అడ్డగోడను ఢీకొంది. పది అడుగుల దూరం వరకు అడ్డుగోడపై దూసుకెళ్లిన లారీ అక్కడున్న సిమెంటు గోడకు ఢీకొని వంతెన దాటి ముందు చక్రాలు గాలిలో వేలాడుతూ నిలబడింది.
లారీలో అధిక బరువు గల నోటు పుస్తకాలు ఉండడం వలన లారీ వేలాడుతూ ఉండిపోయింది. ఈ వంతెన కింద మదురై - సెంగోట్టై రైల్వే మార్గంలో ఉంది. ఈ మార్గంలో మదురై - సెంగోట్టై నుంచి వచ్చిన రైళ్లను విరుదునగర్ శివకాశిలో నిలిపి వెనక్కి పంపారు. ఇంకా ఫోర్‌వే మార్గంలో వచ్చే వాహనాలను వేరే మార్గంలో పంపారు.
లారీలో వస్తువుల బరువు ఎక్కువగా ఉండడం వలన మూడు చిన్న క్రేన్‌లను తెప్పించినా లారీని పైకి లాగలేక పోయారు. దీంతో మదురై నుంచి140 టన్నుల బరువును లాగే పెద్ద క్రేన్‌ను రైలు ఇంజన్‌కు తగిలించి రప్పించారు. 12 గంటల పోరాటం తరువాత శుక్రవారం సాయంత్రం లారీనిపక్కకు లాగిన తరువాత వాహనాల రాకపోకలు కొనసాగాయి.
ప్రమాదంలో లారీ యజమాని మురుగానందం, డ్రైవర్ సెల్వకుమార్‌లకు స్వల్పగాయాలు తగిలాయి. ఇద్దరూ విరుదునగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విరుదునగర్ బజార్ పోలీసులు డ్రైవర్ నిద్రపోవడం, అజాగ్రత్త వలన ఈ ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.