చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో వంటగ్యాస్ ప్రమాదాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని డీఎండీకే సభ్యుడు దినకరన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దినకరన్ ఈ విమర్శలు చేశారు. ఆయన విమర్శలకు పౌరసరఫరాల శాఖ మంత్రి కామరాజ్ బదులిస్తూ, తాము చేపడుతున్న చర్యల కారణంగా మూడేళ్లలో ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. వినియోగదారులకు సరఫరా చేసే ముందు వాల్వ్‌ను తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను పారిశ్రామిక వాడల్లోనూ, ఆటోషాపుల్లోనూ వినియోగిస్తుండగా పట్టుకుని 11,140 మందిపై కేసులు పెట్టామని మంత్రి వివరించారు. అంతేగాక దుర్వినియోగానికి పాల్పడిన వారిలో 27 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపామని, వారి నుంచి రూ.1.43 కోట్లు అపరాధం వసూలు చేశామని తెలిపారు.
వంటగ్యాస్ బాధితులకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు చెల్లించామన్నారు. గృహవినియోగదారులు రాత్రి వేళల్లో రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయకపోవడం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వంట గ్యాస్ లీకయినట్లు అనుమానించగానే తలుపులన్నీ తెరవాలని, విద్యుత్ లైట్లను ఎంతమాత్రం వెలిగించరాదన్న సూచనలు ప్రజలకు చేశామని తెలిపారు. ప్రమాదంపై సహాయానికి 24 గంటలపాటూ పనిచేసే 155233 టోల్‌ఫ్రీ నెంబరుకు సమాచారం ఇవ్వవచ్చని ఆయన తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వ పాఠ్యాంశాల సొసైటీ పేరు మారుస్తూ ముసాయిదాను ప్రవేశపెట్టారు. తమిళనాడు పాఠ్యాంశాల సొసైటీ పేరును తమిళనాడు పాఠ్యాంశాలు, విద్యావ్యవహారాల సొసైటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు.
యువత ఘనత మాదే
రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేసిన ఘనత మాది అంటే మాదని అధికార, ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో వాదులాడుకోవడం గమనార్హం. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత డీఎండీకే సభ్యులు దినకరన్ మాట్లాడుతూ, తన వంటి యువకులను ఎమ్మెల్యేలుగా చేసిన విజయకాంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇందుకు మంత్రి వలర్మతి అడ్డుతగులుతూ, అన్నాడీఎంకేలో 35 లక్షల మంది యువతీ యువకులు సభ్యులుగా ఉన్నారని, వీరిలో కొందరు మంత్రులుగానూ, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగారని చెప్పారు. మరో డీఎండీకే సభ్యుడు చంద్రశేఖర్ మంత్రికి అడ్డుతగులుతూ 2005లో విజయకాంత్ పార్టీ పెట్టిన తరువాతనే అన్నాడీఎంకేకు యువత గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. మళ్లీ మంత్రి వలర్మతి మాట్లాడుతూ, నిన్నటి వర్షం కారణంగా మొలచిన మొక్కలు మీరు, పార్టీని అడ్డంపెట్టుకుని బతకాలను చూస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఇలా వాదోపవాదాలు వాగ్యుద్ధాల నడుమ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ముగిశాయి.
‘గ్యాస్’ దుమారం
Published Wed, Aug 6 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement