DMDK MLA
-
మరో వేటు
డీఎండీకే ఎమ్మెల్యేలపై పది రోజుల నిషేధం అసెంబ్లీలో హక్కుల తీర్మానం ఆమోదం విపక్షాల వాకౌట్ విపక్షంపై మరోవేటు వేయడం ద్వారా అధికార పక్షం తన కక్ష తీర్చుకుంది. రెండు అసెంబ్లీ సమావేశాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న డీఎండీకే ఎమ్మెల్యేలపై మరోసారి నిషేధాన్ని విధించింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పది రోజులపాటు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొనేందుకు వీలులేదని నిషేధం విధించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:గత నెల 19వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో డీఎండీకే సభ్యులు అడ్డు తగిలారు. స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. బడ్జెట్ ప్రతులను చించి ఎగురవేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, జయలలితపై విమర్శలు చేశారు. డీఎండీకే ఎమ్మెల్యేలు చంద్రకుమార్, మోహన్‌రాజ్, పార్తిబన్, వెంకటేశన్, శేఖర్, దినకరన్ ప్రస్తుత, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సైతం పాల్గొనరాదని స్పీకర్ ధనపాల్ నిషేధం విధించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు సాగుతుండగా, తమపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డీఎండీకే ఎమ్మెల్యేలు సచివాలయం ముందు ప్రతిరోజూ ధర్నా నిర్వహిస్తున్నారు. వీరి ఆందోళనకు డీఎంకే, కాంగ్రెస్, తదితర పార్టీలన్నీ మద్దతు పలుకుతున్నాయి. సభలో తీర్మానం ఇదిలా ఉండగా, డీఎండీకే ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని ప్రస్తావించేందుకు డీఎంకే సభ్యులు స్టాలిన్ సిద్ధపడగా అదే సమయంలో సదరు ఆరుగురు సభ్యులపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని మంత్రి నత్తం విశ్వనాథన్ ప్రవేశపెట్టారు. సభ్యుల విపరీత చేష్టలపై సభా హక్కుల బృందమే ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇదే బృందంలో సభ్యుడుగా ఉన్న కంభం రామమోహన్ ఈ శిక్ష చాలా ఎక్కువని వ్యాఖ్యానించినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. డీఎండీకే సభ్యులపై విధించిన నిషేధం రెండు యావజ్జీవ శిక్షల వలె ఉందని కాంగ్రెస్ రంగరాజన్ విమర్శించారు. ఈ సమయంలో అధికార ఎమ్మెల్యే బోస్ కలుగజేసుకుంటూ గత ప్రభుత్వం తనను నాలుగు నెలల పాటూ జైలు పాలు చేసిందని, ఎమ్మెల్యేగా పనిచేయకుండా అడ్డుకుందని ఎత్తిపొడిచారు. ఏది ఏమైనా హక్కుల బృందం తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులు శిరసావహించకతప్పదని మంత్రి నత్తం పేర్కొన్నారు. డీఎండీకేకు చెందిన ఆరుగురు సభ్యులపై వచ్చే అసెంబ్లీ సమావేశాలకు కూడా పదిరోజుల పాటూ నిషేధం విధిస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న ఉపసభాపతి పొల్లాచ్చి జయరామన్ ప్రకటించారు. నిషేధం సమయంలో సభ్యులు తమ వేతనాన్ని, రాయితీలను సైతం కోల్పోతారని స్పష్టం చేశారు. ఆరుగురు సభ్యులపై నిషేధం విధిస్తూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించిందని స్పీకర్ ప్రకటించడంతో స్టాలిన్ (డీఎంకే), రంగరాజన్ (కాంగ్రెస్), సౌందరరాజన్ (సీపీఎం), అరుముగం (సీపీఐ), జవహరుల్లా (మనిదనేయ మక్కల్ కట్చి) నిరసన తెలుపుతూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. -
‘గ్యాస్’ దుమారం
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో వంటగ్యాస్ ప్రమాదాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని డీఎండీకే సభ్యుడు దినకరన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దినకరన్ ఈ విమర్శలు చేశారు. ఆయన విమర్శలకు పౌరసరఫరాల శాఖ మంత్రి కామరాజ్ బదులిస్తూ, తాము చేపడుతున్న చర్యల కారణంగా మూడేళ్లలో ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. వినియోగదారులకు సరఫరా చేసే ముందు వాల్వ్‌ను తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను పారిశ్రామిక వాడల్లోనూ, ఆటోషాపుల్లోనూ వినియోగిస్తుండగా పట్టుకుని 11,140 మందిపై కేసులు పెట్టామని మంత్రి వివరించారు. అంతేగాక దుర్వినియోగానికి పాల్పడిన వారిలో 27 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపామని, వారి నుంచి రూ.1.43 కోట్లు అపరాధం వసూలు చేశామని తెలిపారు. వంటగ్యాస్ బాధితులకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు చెల్లించామన్నారు. గృహవినియోగదారులు రాత్రి వేళల్లో రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయకపోవడం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వంట గ్యాస్ లీకయినట్లు అనుమానించగానే తలుపులన్నీ తెరవాలని, విద్యుత్ లైట్లను ఎంతమాత్రం వెలిగించరాదన్న సూచనలు ప్రజలకు చేశామని తెలిపారు. ప్రమాదంపై సహాయానికి 24 గంటలపాటూ పనిచేసే 155233 టోల్‌ఫ్రీ నెంబరుకు సమాచారం ఇవ్వవచ్చని ఆయన తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వ పాఠ్యాంశాల సొసైటీ పేరు మారుస్తూ ముసాయిదాను ప్రవేశపెట్టారు. తమిళనాడు పాఠ్యాంశాల సొసైటీ పేరును తమిళనాడు పాఠ్యాంశాలు, విద్యావ్యవహారాల సొసైటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. యువత ఘనత మాదే రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేసిన ఘనత మాది అంటే మాదని అధికార, ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో వాదులాడుకోవడం గమనార్హం. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత డీఎండీకే సభ్యులు దినకరన్ మాట్లాడుతూ, తన వంటి యువకులను ఎమ్మెల్యేలుగా చేసిన విజయకాంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇందుకు మంత్రి వలర్మతి అడ్డుతగులుతూ, అన్నాడీఎంకేలో 35 లక్షల మంది యువతీ యువకులు సభ్యులుగా ఉన్నారని, వీరిలో కొందరు మంత్రులుగానూ, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగారని చెప్పారు. మరో డీఎండీకే సభ్యుడు చంద్రశేఖర్ మంత్రికి అడ్డుతగులుతూ 2005లో విజయకాంత్ పార్టీ పెట్టిన తరువాతనే అన్నాడీఎంకేకు యువత గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. మళ్లీ మంత్రి వలర్మతి మాట్లాడుతూ, నిన్నటి వర్షం కారణంగా మొలచిన మొక్కలు మీరు, పార్టీని అడ్డంపెట్టుకుని బతకాలను చూస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఇలా వాదోపవాదాలు వాగ్యుద్ధాల నడుమ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ముగిశాయి. -
భూమి ఆక్రమణ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
భూమి ఆక్రమణపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎండికే నాయకుడు, తిరుపరాంకురం ఎమ్మెల్యే ఏ.కే.టీ.రాజాను అరెస్ట్ చేసినట్లు తమిళనాడు పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అయనపై భూమి అక్రమణ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. జ్యూడిషియల్ కస్టడికి తరలించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... చెట్టిపట్టిలోని 50 ఏకరాల భూమి తనకు బహుమతిగా వచ్చిందని, ఆ భూమిని తన కుమారుడు అక్రమించాడని రాజా తల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. అయితే తమ ఎమ్మెల్యే రాజాను వెంటనే విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుస్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు వారిని చెదరగొట్టి మద్దతుదారులను అక్కడ నుంచి పంపివేశారు.