మరో వేటు
డీఎండీకే ఎమ్మెల్యేలపై
పది రోజుల నిషేధం
అసెంబ్లీలో హక్కుల తీర్మానం ఆమోదం
విపక్షాల వాకౌట్
విపక్షంపై మరోవేటు వేయడం ద్వారా అధికార పక్షం తన కక్ష తీర్చుకుంది. రెండు అసెంబ్లీ సమావేశాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న డీఎండీకే ఎమ్మెల్యేలపై మరోసారి నిషేధాన్ని విధించింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పది రోజులపాటు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొనేందుకు వీలులేదని నిషేధం విధించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:గత నెల 19వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో డీఎండీకే సభ్యులు అడ్డు తగిలారు. స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. బడ్జెట్ ప్రతులను చించి ఎగురవేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, జయలలితపై విమర్శలు చేశారు. డీఎండీకే ఎమ్మెల్యేలు చంద్రకుమార్, మోహన్‌రాజ్, పార్తిబన్, వెంకటేశన్, శేఖర్, దినకరన్ ప్రస్తుత, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సైతం పాల్గొనరాదని స్పీకర్ ధనపాల్ నిషేధం విధించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు సాగుతుండగా, తమపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డీఎండీకే ఎమ్మెల్యేలు సచివాలయం ముందు ప్రతిరోజూ ధర్నా నిర్వహిస్తున్నారు. వీరి ఆందోళనకు డీఎంకే, కాంగ్రెస్, తదితర పార్టీలన్నీ మద్దతు పలుకుతున్నాయి.
సభలో తీర్మానం
ఇదిలా ఉండగా, డీఎండీకే ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని ప్రస్తావించేందుకు డీఎంకే సభ్యులు స్టాలిన్ సిద్ధపడగా అదే సమయంలో సదరు ఆరుగురు సభ్యులపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని మంత్రి నత్తం విశ్వనాథన్ ప్రవేశపెట్టారు. సభ్యుల విపరీత చేష్టలపై సభా హక్కుల బృందమే ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇదే బృందంలో సభ్యుడుగా ఉన్న కంభం రామమోహన్ ఈ శిక్ష చాలా ఎక్కువని వ్యాఖ్యానించినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. డీఎండీకే సభ్యులపై విధించిన నిషేధం రెండు యావజ్జీవ శిక్షల వలె ఉందని కాంగ్రెస్ రంగరాజన్ విమర్శించారు. ఈ సమయంలో అధికార ఎమ్మెల్యే బోస్ కలుగజేసుకుంటూ గత ప్రభుత్వం తనను నాలుగు నెలల పాటూ జైలు పాలు చేసిందని, ఎమ్మెల్యేగా పనిచేయకుండా అడ్డుకుందని ఎత్తిపొడిచారు. ఏది ఏమైనా హక్కుల బృందం తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులు శిరసావహించకతప్పదని మంత్రి నత్తం పేర్కొన్నారు. డీఎండీకేకు చెందిన ఆరుగురు సభ్యులపై వచ్చే అసెంబ్లీ సమావేశాలకు కూడా పదిరోజుల పాటూ నిషేధం విధిస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న ఉపసభాపతి పొల్లాచ్చి జయరామన్ ప్రకటించారు. నిషేధం సమయంలో సభ్యులు తమ వేతనాన్ని, రాయితీలను సైతం కోల్పోతారని స్పష్టం చేశారు. ఆరుగురు సభ్యులపై నిషేధం విధిస్తూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించిందని స్పీకర్ ప్రకటించడంతో స్టాలిన్ (డీఎంకే), రంగరాజన్ (కాంగ్రెస్), సౌందరరాజన్ (సీపీఎం), అరుముగం (సీపీఐ), జవహరుల్లా (మనిదనేయ మక్కల్ కట్చి) నిరసన తెలుపుతూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.