అసెంబ్లీ వద్ద నినాదాలిస్తున్న స్టాలిన్, ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడి కాల్పుల ఘటన తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు తూత్తుకుడి ఘటనపై తీవ్ర వాగ్వాదానికి దిగారు. స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలంటూ కేబినెట్ తీర్మానం చేసేదాకా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష డీఎంకే ప్రకటించింది. దీంతో ప్రభుత్వం కాస్తంత దిగివచ్చింది. తూత్తుకుడి ఘటనకు నిరసనగా మంగళవారం డీఎంకే సభ్యులు నలుపు రంగు దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే తూత్తుకుడిలో పోలీసు కాల్పుల అనంతరం తీసుకున్న నష్ట నివారణ చర్యలు, స్టెరిలైట్ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అధికార అన్నాడీఎంకే సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
అయితే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం వాటిని కంటితుడుపు చర్యలుగా పేర్కొంది. కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పళనిస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వెంటనే కేబినెట్‌ను సమావేశపరిచి స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేస్తూ తీర్మానం చేయాలని పేర్కొంది. ఆ తీర్మానం చేసేదాకా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమంటూ డీఎంకే నేత స్టాలిన్ సహా ఆ పార్టీ సభ్యులంతా వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం..ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వేదాంత గ్రూప్ స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణ రెండోదశకు ఇచ్చిన 342.22 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు 13 మంది మరణానికి కారణమైన పోలీసు కాల్పులపై సీబీ–సీఐడీ విచారణకు ఆదేశించింది. తూత్తుకుడిలోని వేదాంత గ్రూప్‌నకు చెందిన స్టెరిలైట్ కర్మాగారం కాలుష్యాన్ని వెదజల్లుతోందంటూ ప్రజలు ఆందోళన చేయడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment