దూకుడు పెంచిన దినకరన్
చెన్నై: ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి బహిష్కరణకు గురైన ఏఐఏడీఎంకే (అమ్మ) వర్గం నేత టీటీవీ దినకరన్ దూకుడు మరింత పెంచారు. పార్టీని సోమవారం పునర్‌వ్యవస్థీకరించారు. ఇందులోభాగంగా సీనియర్ నేతలతోపాటు మంత్రులను సైతం పార్టీ పదవులనుంచి తప్పించారు. ఈ జాబితాలో సీనియర్ మంత్రులు పి.తంగమణి, ఎస్‌పీ వేలుమణిలున్నారు. నమ్మక్కల్, కోయంబతూర్ జిల్లా శాఖ కార్యదర్శుల పదవుల్లో ఉన్న వీరిని తొలగించారు. తిరుచిరాపల్లి నగర శాఖ కార్యదర్శి నటరాజన్‌ను సైతంఆ పదవి నుంచి తప్పించారు. ఇంకా తిరుచిరాపల్లి శాఖ కార్యదర్శి రతినవేల్‌ను సైతం తొలగించారు. ఇతర జిల్లాల శాఖలను సైతం పునర్‌వ్యవస్థీకరిస్తామని, పార్టీ అధినేత్రి శశికళ ఆమోదంతోనే ఇదంతా చేశానని ప్రకటించారు.
ఎప్పుడో సాగనంపాం కదా: పళనిస్వామి
ఉప ప్రధాన కార్యదర్శి పదవినుంచి దినకరన్‌ను ఈ నెల పదో తేదీనే తొలగించామని, అందువల్ల ఆయన చేపట్టే మార్పులుచేర్పులు చెల్లబోవని ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన ఏఐఏడీఎంకే సమావేశం తేల్చిచెప్పింది. జయలలిత హయాంలో జరిగిన నియామకాలను తొలగించే అధికారం ఆయనకు ఎంతమాత్రం లేదంటూ ఓ తీర్మానం చేశారు. పళనిస్వామి నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తదితరులు హాజరయ్యారు.