శశికళ, దినకరన్‌కు షాక్!
చెన్నై: దివంగత నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ, ఆమె అక్క కొడుకు దినకరన్‌కు అధికార అన్నాడీఎంకే షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న దినకరన్‌పై సీఎం పళనిస్వామి వర్గం వేటు వేసింది. అన్నాడీఎంకే డీప్యూటీ సెక్రటరీ జనరల్‌గా దినకరన్ ఎన్నిక చట్టవిరుద్ధమంటూ తీర్మానం చేసింది. ఈ తీర్మానం అన్నాడీఎంకేలో కీలక పునరేకీకరణకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.
అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడం, ఆమె వారసుడిగా తెరపైకి వచ్చిన దినకరన్ ఎన్నికల గుర్తు కేసులో అరెస్టవ్వడంతో అధికార అన్నాడీఎంకేలో సమీకరణలు మారిపోయాయి. శశికళ అనుచరుడిగా సీఎం పదవి చేపట్టిన ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్) ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తూ.. అధికార పార్టీని తన అధీనంలో తెచ్చుకున్నారు. మరోవైపు అన్నాడీఎంకేలో మరో కీలక వర్గంగా మారిన మాజీ సీఎం ఓ. పన్నీర్ సెల్వం (ఓపీఎస్)తో చేతులు కలిపి.. పార్టీని పటిష్ట పరుచుకోవడం, తన అధికారాన్ని సుస్థిరపరుచుకోవడంపై దృష్టి పెట్టారు. అయితే, పళనిస్వామితో చేతులు కలుపాలంటే శశికళను, దినకరన్‌ను పార్టీ నుంచి తొలగించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అన్నాడీఎంకేలో కీలకంగా ఉన్న ఈపీఎస్-ఓపీఎస్ వర్గాల విలీనానికి రంగం సిద్ధమవుతున్న సమయంలో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన దినకరన్ మళ్లీ అలజడి రేపారు. అన్నాడీఎంకే పార్టీ శశికళదేనని, ఆమె స్థానంలో తానే పార్టీ అధినేతనంటూ ప్రకటనలు ఇచ్చారు. ఆయనకు పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకుంటానని దినకరన్ చేసిన ప్రకటనలు ఈపీఎస్-ఓపీఎస్ వర్గాల్లో కలకలం రేపాయి. ఈ క్రమంలోనే దినకరన్‌పై వేటు వేస్తూ ఈపీఎస్ వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఈపీఎస్-ఓపీఎస్ వర్గాల విలీనానికి మార్గం సుగమం అయినట్టు భావిస్తున్నారు.