మండలి చైర్మన్‌గా దేశ్‌ముఖ్ | Maharashtra legislative council chairman bats for open ballot system | Sakshi
Sakshi News home page

మండలి చైర్మన్‌గా దేశ్‌ముఖ్

Published Thu, May 8 2014 11:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

మండలి చైర్మన్‌గా దేశ్‌ముఖ్ - Sakshi

మండలి చైర్మన్‌గా దేశ్‌ముఖ్

విపక్షనేతగా తావ్డే
ముంబై: ఊహించినట్టే జరిగింది. విధానసభ చైర్మన్ మండలి నూతన చైర్మన్‌గా చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్ గురువారం మరోసారి ఎన్నికయ్యారు. ఇక విపక్ష నేతగా బీజేపీ నాయకుడు వినోద తావ్డేను పునర్నియమించారు. సభా సంప్రదాయాల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, విపక్ష నాయకుడు వినోద్ తావ్డే, రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి హర్షవర్ధన్‌పాటిల్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవికి వరుసగా మూడుసార్లు ఎన్నికైన దేశ్‌ముఖ్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ చైర్మన్ పదవికి రాజ్యసభ ఎన్నికల మాదిరిగానే ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతానని ప్రకటించారు.

ఈ విధానంలో సభ్యులు తమ ఓటును పార్టీ ప్రతినిధికి చూపెట్టాకే వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మండలి చైర్మన్ ఎన్నికల కోసం నిర్వహిస్తున్న రహస్య ఓటింగ్ పద్ధతిని రద్దు చేసి బహిరంగ ఓటింగ్ విధానానికి అనుమతించే చట్టాన్ని మహారాష్ట్ర శాసనసభ 2007లోనే ఆమోదించింది. ఇది అమల్లోకి రావడానికి తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ ప్రకటించారు. చైర్మన్ పదవి కోసం బుధవారం శివాజీరావ్ మినహా మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది.  

శివసేన, బీజేపీ, ఆర్పీఐ మహాకూటమి తమ అభ్యర్థిని మండలి చైర్మన్ పదవి కోసం బరిలోకి దింపనుందనే వార్తల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. చివరకు మహాకూటమి తరఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో శివాజీరావ్ ఎన్నిక  ఖరారయింది. కాంగ్రెస్, ఎన్సీపీ నేతల సమక్షంలో దేశ్‌ముఖ్ నామినేషన్ వేశారు. ఆయన వెంట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు ఉన్నారు.  

 ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ
ముంబై: విధాన మండలి ద్వైవార్షిక ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. నాలుగు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ నియోజకవర్గాల ఎన్నికల్లో బరిలోకి దిగనున్నామని ఎంపీసీసీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ గురువారం మీడియాకు తెలిపారు. సీఎం పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, ఇతర సీనియర్ అధికారులతో ఉదయం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. జూలై 19తో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి కానుంది.

ఔరంగాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి సతీష్ చవాన్(ఎన్‌సీపీ), పుణే గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి చంద్రకాంత్ పాటిల్(బీజేపీ), నాగపూర్ గ్రాడ్యుయేట్ నుంచి నితిన్ గడ్కారీ(బీజేపీ), పుణే టీచర్ నియోజకవర్గం  నుంచి భాగవన్ సాలుంకే(ఇండిపెండెంట్), అమరావతి టీచర్ నియోజకవర్గం నుంచి వసంత్ కొఠారే(ఇండిపెండెంట్)లు ఉన్నారని సచిన్ వివరించారు. గతంలో వ్యక్తులు, వివిధ సంస్థలకు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని, అయితే ఈసారి ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించిందని చెప్పారు.

ఈ స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులు పర్యటించనున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో యువతకు అవకాశమిచ్చి పార్టీని మరింత పటిష్టం చేయాలనుకుంటున్నామన్నారు. ఇండిపెండెంట్లకు మద్దతివ్వడం వల్ల పార్టీకి రాజకీయంగా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుందని తెలిపారు. 78 మంది సభ్యులున్న విధాన మండలిలో కాంగ్రెస్ కంటే ఎన్‌సీపీకే ఎమ్మెల్సీ స్థానాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement