సీఎం ఫడ్నవిస్ ఆదేశం
రీజియన్ స్థాయి అధికారులకు అధికారాలు
మంత్రాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్య
స్వాగతించిన అధికారుల సంఘాలు
సాక్షి, ముంబై: వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఇతర సిబ్బంది బదిలీల కోసం మంత్రాలయ చుట్టూ తిరగనవసరం లేదు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బదిలీల అధికారాన్ని వారు ఉద్యోగం చేస్తున్న విభాగ స్థాయికే అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి బదిలీల కోసం ఉద్యోగులు మంత్రాలయలోని మంత్రుల క్యాబిన్ల చుట్టూ తిరగాల్సిన అవసరముండదని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఈ బదిలీల పర్వాన్ని తొలుత ఇరిగేషన్, ఆహార, ఔషధ శాఖ నుంచి ప్రారంభించారు. విడతల వారీగా త్వరలో ఇతర శాఖల బదిలీలను కూడా రీజియన్ స్థాయిలో జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. ‘మినిమం గవర్నమెంట్, మేగ్జిమం గవర్నెన్స్’ అనే సూత్రంపై ఇక నుంచి ప్రభుత్వ పనులు కొనసాగుతాయని ఫడ్నవిస్ తెలిపారు.
ఇరిగేషన్ శాఖలో పెద్ద సంఖ్యలో ఏ, బి. స్ధాయి అధికారులు ఉన్నారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల బదిలీల అధికారం గతంలో ముఖ్యమంత్రి వద్ద ఉండేది. ఇక నుంచి బదిలీల అధికారం ఆ శాఖకు చెందిన విభాగ స్థాయిలో ఉండే ప్రధాన కార్యదర్శికి అప్పగించారు. డిప్యూటీ ఇంజినీర్ల బదిలీల అధికారం ఇరిగేషన్ శాఖ మంత్రుల నుంచి తొలగించి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు అప్పగించారు. అదేవిధంగా ఇంజినీరు, జూనియర్ ఇంజినీరు, అసిస్టెంట్ ఇంజినీర్ల బదిలీలు ఇకనుంచి సూపరింటెండెంట్ ఇంజినీరు సలహాల ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు చేస్తారు. ఇదివరకు ఈ అధికారాలు ఇరిగేషన్ శాఖ సహాయ మంత్రివద్ద ఉండేవి.
ఆహార, ఔషధ శాఖ ఇన్‌స్పెక్టర్, సైంటిస్టులు, అహార భద్రత అధికారులు, పరిపాలన విభాగం అధికారుల బదిలీల అధికారం ఈ శాఖకు చెందిన కేబినెట్ మంత్రి నుంచి తొలగించి కమిషనర్‌కు అప్పగించారు. 161 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, 265 మంది ఆహార భద్రత అధికారులు ఉన్నారు. వీరందరి బదిలీల అధికారం మంత్రాలయ స్థాయి నుంచి తొలగించి రీజియన్ స్థాయికి అప్పగించారు. ఇలా ఒక్కొక్క శాఖను మంత్రాలయ నుంచి విభాగ స్థాయికి అప్పగించే ప్రక్రియ ప్రారంభించారు. ఫడ్నవిస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర స్టేట్ గెజిటెడ్ అధికారుల మహాసంఘం స్వాగతించింది. దీని కారణంగా గత అనేక దశాబ్దాలుగా బదిలీల ప్రక్రియలో జరుగుతున్న అవినీతి, పైరవీల సంస్కృతికి కళ్లెం పడనుందని మహాసంఘం నాయకుడు జి.డి.కుల్తే అభిప్రాయపడ్డారు.
విభాగ స్థాయిలోనే బదిలీలు..
Published Sun, Nov 16 2014 10:07 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement