
కూల్చివేత తప్పదా?
సాక్షి, చెన్నై: చెన్నై బీచ్ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా రాజాజీ రోడ్డులో ఉన్న పురాతన ఎస్‌బీఐ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ భవనం స్థితి గతులపై పరిశీలనకు ఐఐటీ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ భవనాన్ని ఆంగ్లేయుల హయాంలో నిర్మించారు. స్థలాన్ని రూ.లక్షకు కొనుగోలు చేసి, రూ.మూడు లక్షలతో అతి పెద్ద భవనాన్ని నిర్మించారు. ఆ భవనం నిర్మించి ఇప్పటికి 117 ఏళ్లు పూర్తయింది. వెలుపలకు ఆ భవనంపురాతన వైభవాన్ని చాటే విధంగా గాంభీర్యంగా దర్శనం ఇస్తున్నా, వెనుక వైపు, లోపలి భాగంలో పలు చోట్ల గోడలు బీటలు వారాయి. ఇది వరకు గోడలు బీటలు వారి, వాటికి ప్లాస్టింగ్ చేసి ఉండటంతో పాటుగా, ఈ ప్రమాదం రూపంలో ఆ భవనం తీవ్ర ముప్పును చవిచూసి ఉన్నట్టుగా నిపుణుల పరిశీలనలో వెలుగు చూసింది.
అయితే, ఈ భవనం మళ్లీ పునరుద్ధరించడం కష్టమని నిర్ధారణకు వచ్చారు. ఈ భవనాన్ని కూల్చి వేయడమా లేదా అన్న తదుపరి కార్యాచరణ గురించి ఈ నిపుణుల బృందం సమగ్ర పరిశీలనచేపట్టనుంది.మూడు బ్రాంచ్‌లకు సేవలు : ఈ భవనంలో మూడు బ్రాంచ్‌లుగా ఎస్‌బీఐ సేవలను అందించారు. చెన్నై ప్రకాశం రోడ్డు ప్రధాన బ్రాంచ్, రాజాజీ రోడ్డు బ్రాంచ్, ఎస్‌ఎంసీఏ బ్రాంచ్‌లుగా ఈ భవనాన్ని ఎస్‌బీఐ ఉపయోగించుకుంటూ, అగ్ని ప్రమాదం బారిన పడింది. ఈ భవనాన్ని ఖాళీ చేయించే దిశగా ఎస్‌బీఐ వర్గాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఇక్కడి సేవలను ఇతర బ్రాంచ్‌లకు బదిలీ చేసే పనిలో పడ్డారు. చెన్నై ప్రకాశం రోడ్డు ప్రధాన బ్రాంచ్ సేవలు ఇక, బ్రాడ్ వే బ్రాంచ్‌లో, రాజాజీ రోడ్డు బ్రాంచ్ సేవలు ఎగ్మూర్‌లో, ఎస్‌ఎంసీఏ బ్రాంచ్ సేవలు టీ నగర్ బ్రాంచ్‌లో అందించనున్నారు.
ఖాతాదారులకు భరోసా : ఈ విషయమై ఎగ్మూర్ బ్రాంచ్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్‌బీఐ సీజీఎం ప్రకాష్ రావు మాట్లాడుతూ, పురాతన భవనం అగ్ని ప్రమాదం బారిన పడడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆ భవనంలో ఉన్న బ్రాంచ్ సేవలను మరో చోటకు మార్చామని, సోమవారం నుంచే ఆయా బ్రాంచ్‌లలో ఖాతాదారులు తమ సేవలను కొనసాగించ వచ్చని వివరించారు. నగరంలో మరో మూడు బ్రాంచ్‌లు పురాతన భవనాల్లో ఉన్నాయని, అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ఆ భవనాల్లో కట్టుదిట్టమైన భ ద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఖాతాదారుల నగదు, నగలు, రికార్డులు అన్నీ సురక్షితంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన భవనంలో ఉన్న లాకర్లను, కీలక రికార్డులను గట్టి భద్రత నడుమ ఇతర బ్రాంచ్‌లకు మార్చినట్లు తెలిపారు. ఖాతాదారులు తమ బ్రాంచ్‌ల గురించిన వివరాలను తెలుసుకోవడంలో ఇబ్బందులు ఉంటే, ఫోన్‌లు చేయొచ్చంటూ నంబర్లను ప్రకటించారు. పురాతన భవనం వద్ద ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడికి వచ్చే ఖాతాదారులను ఆ వాహనాల్లో వారి వారి బ్రాంచ్‌లకు చేర్చనున్నట్లు వివరించారు. ఫోన్ నెంబర్లు : ప్రధాన బ్రాంచ్ సేవలకు - 9445861231, రాజాజీ రోడ్డు బ్రాంచ్ సేవలకు 9445860962, ఎస్‌ఎంసీఏ బ్రాంచ్ సేవలకు 9445866364లను సంప్రదించవచ్చని సూచించారు.