
ఎస్‌బీఐలో మళ్లీ మంటలు
సాక్షి, చెన్నై :చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం శనివారం మంటల్లో చిక్కిన విషయం తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది వీరోచిత శ్రమతో పెను నష్టం తప్పింది. ఆ భవనం రెండు, మూడు అంతస్తులు అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే, ఖాతాదారుల నగదు, నగలకు ఎలాంటి ముప్పు వాటిల్ల లేదు. అక్కడి క్యాంటీన్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను చాకచక్యంగా అగ్నిమాపక సిబ్బంది తరలించి, పెను ప్రమాదం నుంచి ఆ భవనాన్ని తప్పించారు. ఇక ప్రమాదం తప్పినట్టేనని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషించే పనిలో పడ్డారు. రెండో అంతస్తులో పాత ఫర్నిచర్ ఉంచిన గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందన్న భావనలో పడ్డారు. రాత్రి కావడంతో అక్కడి నుంచి అగ్నిమాపక వాహనాలు కదిలాయి. తదుపరి కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించే పనిలో ఎస్‌బీఐ అధికారులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ మళ్లీ మంటలు చెలరేగడం ఆ పరిసరాల్లో కలకలం సృష్టించింది.
పేలుడు శబ్దం: అర్ధరాత్రి సరిగ్గా రెండున్నర గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఆ భవనం నుంచి మంటలు చెలరేగడాన్ని ఆ పరిసరవాసులు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి మళ్లీ అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది పరుగులు తీశారు. రాత్రి నుంచి ఉదయం ఏడు గంటల వరకు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ఆ పరిసరవాసులకు రాత్రంతా కునుకు లేదు. అలాగే, మంటలు మొదటి అంతస్తులోకి వ్యాపించకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. అయితే, రెండో సారి మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం గ్యాస్ సిలిండర్ అని తేలింది. శనివారం క్యాంటీన్ నుంచి రెండు సిలిండర్లను అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా బయటకు తీసుకొచ్చారు. అయితే, ఆ క్యాంటీన్ సిబ్బంది మరో సిలిండర్‌ను రహస్యంగా ఉంచి మరచినట్టున్నారు. దీంతో ఆ సిలిండర్ అర్ధరాత్రి వేళ పేలి మరో మారు అందరినీ వణికించేలా చేసింది.
ప్రమాదం అంచున భవనం
తొలిసారి ప్రమాదానికే మూడో అంతస్తు గోడలు దెబ్బతిన్నాయి. అర్ధరాత్రి సిలిండర్‌పేలిన దాటికి రెండో అంతస్తు భవనం ప్రమాదం బారిన పడింది. ఆ పురాతన భవనం పూర్తిగా ప్రమాదం అంచుకు చేరడంతో, ఇక్కడ బ్యాంకు నిర్వహణ అనుమానంగా మారింది.
ఉదయాన్నే అక్కడికి చేరుకున్న ఎస్‌బీఐ అధికారులు మొదటి, రెండు, మూడు అంతస్తుల్లో కీలక పరిశీలనలు జరిపారు. కొన్ని బీరువాల్ని మరో చోటకు సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యామ్నాయంగా బ్యాంక్ నిర్వహణ వ్యవహారాలను మరో చోటకు తాత్కాలికంగా మార్చేందుకు కసరత్తులు వేగవంతం చేశారు. బ్యాంకు మంటల్లో చిక్కిన సమాచారంతో ఖాతా దారులు ఉదయాన్నే అక్కడికి పరుగులు తీశారు. ఆ బ్యాంక్‌లో ఉన్న తమ నగదు, నగలు ఏమయ్యాయో ఆరా తీసే పనిలో పడ్డారు. అయితే, బ్యాంక్ అధికారుల నుంచి సరైన సమాచారం రాకపోవడంతో ఆందోళనకు దిగారు. చివరకు బ్యాంక్ ఉన్నతాధికారి ప్రకాష్ రావు జోక్యం చేసుకుని ఖాతాదారులను బుజ్జగించారు. నగదు, నగలు సురక్షితంగా ఉన్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇక, ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు బ్యాంక్ అధికారుల నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సోమవారం రంగంలోకి దిగనుంది. అలాగే, పోలీసులు సైతం విచారణను వేగవంతం చేశారు.
అన్నీ సురక్షితం
అగ్ని ప్రమాదం జరిగిన ఎస్‌బీఐలో రికార్డులు, లాకర్లు, నగదు, నగలు అన్నీ సురక్షితంగా ఉన్నాయని ఆ బ్యాంక్ ఉన్నతాధికారి సూర్య ప్రకాష్ రావు స్పష్టం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఖాతాదారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్నీ సురక్షితంగా ఉన్నాయని వివరించారు. వీటన్నింటినీ 48 గంటల్లో మరో బ్రాంచ్‌కు మార్చడం జరుగుతుందన్నారు. ఈ వివరాలను ఖాతాదారులకు తెలియజేస్తామని తెలిపారు. ఈ భవనాన్ని ఐఐటీ నిపుణులు పరిశీలించారు. పురావస్తు విభాగం అధికారుల పరిశీలనానంతరం ఈ భవనం గురించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.