
నూతన ఒరవడికి శ్రీకారం
పిల్లలపై లైంగికదాడుల్లాంటి అమానుష సంఘటనలను అరికట్టడానికి పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను
స్టూడెంట్ పోలీస్ కాడెట్ ప్రారంభం
లైంగికదాడుల నివారణకు చైతన్యం అవసరం
సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు(బనశంకరి): పిల్లలపై లైంగికదాడుల్లాంటి అమానుష సంఘటనలను అరికట్టడానికి పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. సోమవారం కంఠీరవ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టూడెంట్ పోలీస్ కాడెట్ పథకాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. సమాజంలో పిల్లలపై జరుగుతున్న లైంగికదాడులు, అత్యాచారాలు లాంటి అమానుష దుశ్చర్యలను అరికట్టే కార్యక్రమాలు పాఠశాల, కాలేజీ స్థాయి నుంచే ప్రారంభం కావాలన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని స్టూడెంట్ పోలీస్ కాడెట్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. కర్ణాటక పోలీసులు నూతన ప్రయోగం చేశారని, స్టూడెంట్ కాడెట్ పథకం పాఠశాల స్థాయిలో యువకుల ఎదుగుదలకు దోహదం చేస్తుందన్నారు. పాఠశాల-కాలేజీ విద్యార్థుల్లో సామాజిక జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు.
కేరళలో ఈ పథకం విజయవంతమైందని తెలిపారు. సమాజంలో జవాబుదారీతనంతో కూడిన యువతీయువకులను తయారు చేస్తుందని సమాజంలో శాంతి భద్రతలు ఉండాలంటే ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. పోలీసులు జనస్నేహిగా సమాజ శ్రేయస్సుకోసం పనిచేయాలన్నారు. అప్పుడే సమస్యలు పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థి దశ నుంచి జాగృతం చేసే ఈ పథకం ద్వారా దేశప్రేమను పొందడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఇటీవల రోజుల్లో మానవవిలువలు క్షీణిస్తున్నాయన్నారు. ధర్మ-అధర్మాల మధ్య, జాతి-జాతుల మధ్య ఘర్షణలు శాంతికి భంగం కలిగిస్తున్నాయన్నారు. ఇలాంటి దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడే గుణం యువత అలవరుచుకోవాలన్నారు. యూనిఫాం ధరించిన తరువాత ఎలాంటి తప్పు చేయరాదని స్టూడెంట్ పోలీస్ కాడెట్లకు తెలిపారు.
అనంతరం హోంమంత్రి కేజే జార్జ్ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతలు కాపాడడం, ఆస్తులకు రక్షణ కల్పించడం కేవలం పోలీస్ శాఖతోనే సాధ్యం కాదన్నారు. ప్రజలు, సంఘ సంస్థలు సహకరించి అందరూ చేయి కలపాలన్నారు. స్టూడెంట్ పోలీస్ కాడెట్ పథకం యువకుల్లో చట్టంపై అవగాహన పెంచే ఉత్తమ సాధనమన్నారు. దేశభవిష్యత్ యువకులతోనే సాధ్యమని, దేశాభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా నూతన డీజీపీ ఓంప్రకాష్, నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్.రెడ్డి, నేరవిభాగం అదనపు పోలీస్ కమిషనర్ హరిశేఖరన్, శాంతి భదత్రల విభాగం అదనపు కమిషనర్ అలోక్‌కుమార్ పాల్గొన్నారు.