
చెన్నై విమానాశ్రయంలో యువతిపై అత్యాచారయత్నం
- యువకుడికి దేహశుద్ధి
టీనగర్ (చెన్నై):
చెన్నై విమానాశ్రయం విశ్రాంతి గదిలో ఉన్న యువతిపై అత్యాచారం జరిపేందుకు ప్రయత్నించిన యువకుడికి ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన అక్కడ సంచలనం రేపింది. బాధిత 17 ఏళ్ల యువతి బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతోంది. గురువారం రాత్రి ఆమె అండమాన్ వెళ్లేందుకు బెంగుళూరు నుంచి చెన్నై చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అండమాన్ వెళ్లే విమానంలో టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో వీఐపీలు బసచేసే విశ్రాంతి గదిలో యువతి బసచేసింది.
శుక్రవారం ఉదయం 6.30 గంటలకు తలుపు తట్టిన చప్పుడు కావడంతో యువతి గదిని శుభ్రపరిచేందుకు ఎవరైనా వచ్చివుంటారని భావించి తలుపుతీశారు. ఆ సమయంలో గదిలోకి ప్రవేశించిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. తప్పించుకున్న ఆ యువతి బయటికి వచ్చి కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది పరుగున వచ్చి యువకునికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతన్ని విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకుడు తమిళనాడులోని దిండుగల్ జిల్లాకు చెందిన హారున్ రషీద్ (32)గా తెలిసింది. ఇతను గత ఆరు రోజుల క్రితం అదృశ్యమైనట్లు దిండుగల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. అతనికి మానసిక స్థిమితం లేదని, అతను ఇల్లు విడిచి పరారైనట్లు సమాచారం. అతని గురించి దిండుగల్‌లో ఉన్న కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందించారు.