ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: ఇంజిన్ లేని మోటార్ బైక్‌ను తోసుకుంటూ వచ్చిన యువకుడికి ఓ ఎస్‌ఐ రూ.వెయ్యి జరిమానా విధించి సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారారు. దీంతో ఆ ఎస్‌ఐకి డీఎస్పీ మెమో ఇచ్చారు. తమిళనాడు, కడలూరు జిల్లా భువనగిరి తాలుకా సేత్తియాతోపు గ్రామానికి చెందిన శక్తివేల్ తన మోటార్ సైకిల్‌ను మరమ్మతుల నిమిత్తం బుధవారం ఉదయం మెకానిక్ షాపునకు తరలించారు. అక్కడ ఇంజిన్ భాగాన్ని మెకానిక్ విప్పేయగా, సమీపంలోని వాగులో తన మోటార్ సైకిల్‌ను శుభ్రం చేయడానికి శక్తి వేల్ నిర్ణయించాడు. ఇంజిన్ లేని ఆ మోటార్ సైకిల్‌ను తోసుకుంటూ వాగు వద్దకు వెళ్తున్న శక్తివేల్‌ను ఎస్‌ఐ రత్నవేల్ అడ్డుకున్నాడు. పేపర్లు చూపించాలని, హెల్మెట్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ రూ.వెయ్యి జరిమానా విధించాడు.
అయితే, తాను మరమ్మతులకు గురైన ఇంజిన్ లేని మోటార్ సైకిల్‌ను తోసుకొచ్చానని, జరిమానా చెల్లించబోనని చెప్పాడు. అయితే, ఎస్‌ఐ దూకుడు ప్రదర్శించడంతో చివరకు ఆ దృశ్యాలను తన మొబైల్ కెమెరాలో శక్తివేల్ చిత్రీకరించాడు. తనకు ఎలక్ట్రానిక్ మెషిన్ రశీదు ఇస్తే వెయ్యి చెల్లిస్తానని చెప్పేశాడు. ఆ ఎస్‌ఐ మరీ దూకుడుగా వ్యవహరించడంతో ఆ వీడియో దృశ్యాల్ని వాట్సాప్ ద్వారా సామాజిక మాధ్యమాల్లోకి శక్తివేల్ ఎక్కించాడు. ఇది మరింత హల్‌చల్ కావడంతో ఎస్‌ఐ తీరుపై డీఎస్పీ జవహర్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీంతో మెమో జారీ చేశారు. కాగా, వీరంగం ప్రదర్శించిన ఆ ఎస్‌ఐ మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment