వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
సీజ్ చేసిన వాహనాలను సంబంధిత యజమానులకు అప్పగించేందుకు పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.30లోపు యజమానులు వారి వాహనాలను ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో పొందవచ్చని వెల్లడించారు. సీజ్ చేస్తున్న వాహనాల సంఖ్య పెరగడం.. పార్కింగ్ చేయడానికి చాలినంత స్థలం లేకపోవడంతోనే మళ్లీ యజమానులకు వాహనాలను అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
సాక్షి, చెన్నై: లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత రోడ్ల మీదకు ఇష్టానుసారంగా వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. వీరి భరతం పట్టే విధంగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. కేసులు, అరెస్టులు, వాహనాల సీజ్, జరిమానాలు అంటూ కొరడా ఝుళిపించారు. రోజురోజుకూ సీజ్ చేస్తున్న వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఇందులో అత్యధికంగా మోటారు సైకిళ్లు ఉన్నాయి.
♦ ఆయా పోలీసు స్టేషన్లు, వాటి పరిధిలోని ఖాళీ స్థలాల్లో సీజ్‌చేసిన వాహనాలు పార్క్ చేస్తున్నారు. వీటికి పోలీసు భద్రత అన్నది తప్పని సరిగా మారింది. అదే సమయంలో వాహనాల సంఖ్య క్రమంగా పెరగడంతో వాటిని పార్కింగ్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో ఆయా వాహన యజమాలనకు మళ్లీ అప్పగించేందుకు సిద్ధమయ్యారు.
వాహనాల అప్పగింత
రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 24వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు లక్షా 85 వేల కేసులు నమోదు చేశామని, లక్షా 56 వేల వాహనాలు సీజ్ చేశామని పోలీసులు చెప్పారు. వీటికి జరిమానా రూపంలో రూ. 82.32 లక్షలు వచ్చినట్టు పేర్కొన్నారు. మోటారు సైకిళ్లను సీజ్‌చేస్తూ రావడం వల్ల, ఆయా వాహనాల కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరుగుతోందని, వారిని ఈ సారికి కరుణించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రటించారు. గట్టి హెచ్చరికలు, నిబంధనల మేరకు వారికి వాహనాలు అప్పగించేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. ఆ మేరకు సీజ్ చేసిన వాహనాల్లో అత్యధికంగ మోటారు సైకిళ్లు ఉన్నాయని, ఆయా యజమానులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాటిని అప్పగిస్తామని చెప్పారు.
ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని, ఆయా వాహనదారులకు ఈ సిబ్బంది సమాచారాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏ రోజు, ఏ సమయంలో వాహనాలను పొందాలి అన్న సమాచారం వాహనదారుడికి చేరగానే వచ్చి తీసుకెళ్లవచ్చని సూచించారు. వాహనదారుడు లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ ఒరిజినల్‌తో పాటు నకలు తీసుకు రావాలని సూచించారు. నకలు పోలీసులు తీసుకుంటారని, ప్రతి వాహనదారుడు లాక్‌డౌన్ కొనసాగినన్ని రోజులు రోడ్డు మీదకు రాబోమని, ఒక వేళ వస్తే తమ వాహనాలు సీజ్ చేసుకోవచ్చని పేర్కొంటూ, లిఖిత పూర్వంగా లేఖను సమర్పించాల్సి ఉంటుందని పోలీసులు మెలికపెట్టడం గమనార్హం. ఒక్కో వాహనం పంపినీకి మధ్య అర గంట సమయం ఉంటుందని, ఈ దృష్ట్యా, రోజుకు పది వాహనాలు మాత్రమే అందజేస్తామని, పోలీసు ఇచ్చే సమాచారం, సమయంలో మాత్రమే రావాలని, ఇతర సమయాల్లో వస్తే వాహనాలు ఇవ్వబోమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment