సాక్షి, చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,710 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 60వేలు దాటింది. ఇప్పటి వరకు 62,087 మందికి కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక కోవిడ్ బారిన పడి సోమవారం మరో 37 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 794కు చేరింది. 1,358 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి : లాక్‌డౌన్ ఎఫెక్ట్ : 27,446 మంది అరెస్ట్)
ఇక కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో మదురైలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. కరోనా కేసులు పెరగకుండా ముందు జాగ్రత్తలో భాగంగానే మదురైలో 7రోజల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఇప్పటికే గ్రేటర్ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. జూన్ 19 నుంచి 30వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది. (చదవండి : 28 కోవిడ్ మరణాలు.. విచారణకు సీఎం ఆదేశం)
ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 4.25 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 13,699 మంది కరోనాతో మృతి చెందారు. 2,37,196 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రధానంగా మహరాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది.
Comments
Please login to add a commentAdd a comment