
రెండేళ్ల క్రితం మాయమై..
చెన్నై(అన్నానగర్):
రెండేళ్ల క్రితం మాయమైన యువకుడు హిజ్రాగా తిరిగి వచ్చిన సంఘటన తమిళనాడులోని తిరుపూర్‌లో చోటుచేసుకుంది. కె.సెట్టిపాళయం వోసి నగరానికి చెందిన తామరై సెల్వన్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇతని చిన్న కుమారుడు ముత్తుకుమార్ (20)తిరుపూరులోని బనియన్ సంస్థలో పని చేస్తున్నాడు. 2015 మార్చి నెలలో పనికి వెళ్లిన ముత్తుకుమార్ హఠాత్తుగా మాయమయ్యాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో వెతుకుతున్న క్రమంలో ముత్తుకుమార్ చెన్నై వ్యాసర్‌పాడిలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడి చేరుక్నున్నారు.
హిజ్రాగా మారిన అతన్ని విచారణ చేయగా మహిళగా మారాలనే ఇంటి నుంచి బయటకి వచ్చానని, పేరును కీర్తనగా మార్చుకున్నానని తెలిపాడు. చెన్నైలో ఒకరి సహాయంతో మదురైకి వెళ్లి శస్త్రచికిత్స ద్వారా హిజ్రాగా మారానన్నాడు. ఇలా ఉండటమే తనకు ఇష్టమని పోలీసుల విచారణలో చెప్పాడు. ముత్తుకుమార్ దొరికాడన్న సంతోషంతో పోలీసుస్టేషన్‌కు వెళ్లిన కుటుంబ సభ్యులు హిజ్రాగా మారిన అతన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. అనంతరం పోలీసులు ముత్తుకుమార్‌ను తిరుప్పూరు కోర్టులో హాజరు చేశారు. ముత్తుకుమార్ తన ఇష్ట ప్రకారం ఉండవచ్చని మెజిస్ట్రేట్ నిత్యకళ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ తర్వాత తల్లిదండ్రులతో అతను చెన్నైకి వచ్చాడు.