భారీ ప్రాజెక్టుల కన్నా వాటర్‌ షెడ్లే మేలు | marri shashidhar reddy presentartion on Principles of Watershed Management | Sakshi
Sakshi News home page

భారీ ప్రాజెక్టుల కన్నా వాటర్‌ షెడ్లే మేలు

Published Wed, Oct 19 2016 11:27 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

భారీ ప్రాజెక్టుల కన్నా వాటర్‌ షెడ్లే మేలు

భారీ ప్రాజెక్టుల కన్నా వాటర్‌ షెడ్లే మేలు

చతుర్విద జల ప్రక్రియతో ఎక్కువ లాభాలు
వీటి అమలుపై దృష్టి సారించని ప్రభుత్వం
ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరుతో ప్రజాధనం దోపిడీ
మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి
 
నిజామాబాద్‌ సిటీ : రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు నిర్మించే బదులు వాటర్‌ షెడ్ల కార్యక్రమాలు చేపడితే రైతులకు మేలు జరుగుతుందని గోదావరి జలాల వినియోగ ఫోరం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. నాలుగు సూత్రాల వాటర్‌ షెడ్‌ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో నీటిపారుదలపై ఎక్కువగా పెట్టుబడి పెట్టారని, ఆ రాష్ట్రంలోని డ్యాంలలో, రిజర్వాయర్లలో ఉన్నంత నీటి స్టోరేజీ దేశంలో మరెక్కడా లేదని చెప్పారు. అయినప్పటికీ అక్కడ 2,218 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. మన రాష్ట్రంలోనూ 2,280 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న శశిధర్‌రెడ్డి.. నీటి భద్రత అంశం రాబోయే రోజులలో ఎంతో కీలకంగా మారబోతుందని తెలిపారు. 
 
నీటిపారుదలశాఖ మాజీ ఇంజినీర్‌ టి హన్మంత్‌రావు చతుర్విద జల ప్రక్రియ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. కురిసే వర్షంలో 65 శాతం భూమిలో తేమగా ఉంటుందన్నా విషయం చాలా మందికి తెలియదని, అసలు వాటర్‌ షెడ్‌ అంటే కూడా తెలియదన్నారు. 1973 నుంచి రూ.వేల కోట్లతో చేపట్టిన కార్యక్రమాలతో సత్ఫలితాలు రాలేదని చెప్పారు.
 
వాటర్‌ షెడ్‌ను తీసుకుంటే మూడు పంటలకు నీళ్లు ఇచ్చే విధంగా ఉండాలన్నారు. చతుర్విద జల ప్రక్రియలో ప్రధానంగా ఎలాంటి సిమెంట్‌ ఉపయోగం ఉండదని, కాంట్రాక్టర్లు, చెక్‌డ్యాంలు ఉండవన్నారు. రూ.5 వేలతో ఏడాదికి మూడు పంటలు పండించుకోవడానికి సాధ్యమవుతుందని తెలిపారు. రెండేళ్లు కరువు వచ్చినా జహీరాబాద్‌ సమీపంలోని గొట్టిగారిపల్లిలో చతుర్విద విధానంతో రైతులు రెండు పంటలు పండించుకున్నార ని, తాగునీటికి ఇబ్బంది పడలేదన్నారు. చతుర్విద జల ప్రక్రియ విధానంతో రూ.5 వేల వ్యయంతో ఎకరంలో మూడు పంటలు పండించవచ్చని చెప్పారు. అయినప్పటికీ నాలుగు సూత్రాల ప్రణాళిక విధానాలను ప్రభుత్వాలు ఆచరించలేదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రూ. 5వేల ఖర్చుతో మూడు పంటలకు నీరివ్వడం మంచిదా, లేదా రూ.5 లక్షలతో ఒక పంట గురించి ఆలోచించటం మంచిదా అని ప్రజలే ఆలోచించాలన్నారు. రానున్న రోజులలో నీటి కోసం యుద్ధాలు తప్పవని, ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకోవాలని సూచించారు. మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహేశ్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మాజీ ఎమ్మెల్యే గంగారాం, సుమీర్‌హైమద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement