ఎందుకింత ‘హస్త’వ్యస్తం? | Congress Leadership Upset Over Loss Of Vote Bank In Telangana | Sakshi
Sakshi News home page

ఎందుకింత ‘హస్త’వ్యస్తం?

Published Sat, Dec 10 2022 12:47 AM | Last Updated on Sat, Dec 10 2022 4:36 AM

Congress Leadership Upset Over Loss Of Vote Bank In Telangana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పాటు అందించినా కూడా తెలంగాణలో కాంగ్రెస్‌ అస్తవ్యస్తంగా మారడంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతుండటం, సంప్రదాయ ఓటు బ్యాంకు చేజారడం, నేతలు వీడుతుండటాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల అనంతరం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో బీజేపీ పెద్దగా ఉనికి లేదనుకున్న చోట్ల కూడా ప్రభావం చూపుతోంది. ఈ విషయంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు నేరుగా సోనియాగాంధీకి ఫిర్యాదులు చేశారు. ఇటీవల పార్టీని వీడిన మర్రి శశిధర్‌రెడ్డి ఆయా అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘ రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపారు.

తర్వాత కొందరు సీనియర్‌ నేతలు కూడా ఫ్యాక్స్, ఈమెయిళ్ల ద్వారా పలు అంశాలను సోనియా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె ఈ వ్యవహారం ఏమిటో పరిశీలించాలని ఖర్గేకు సూచించినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఏడాదిన్నరగా కాంగ్రెస్‌ పరిస్థితిపై ఆయన నివేదిక తెప్పించుకున్నట్టు తెలిసింది. 

సాంప్రదాయ ఓటు బ్యాంకు ఏమైంది? 
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 24 శాతం, 28.5 శాతం ఓట్లు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 29.5శాతం వచ్చాయి. ఉంది. తర్వాత జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో 48శాతం, నాగార్జునసాగర్‌లో 42శాతం ఓట్లు సాధించగలిగింది. కానీ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓటు బ్యాంకు 35 శాతం నుంచి ఒక్క శాతానికి పడిపోయింది. మునుగోడులోనూ 49శాతం నుంచి 6 శాతానికి తగ్గిపోయింది.

రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక భారీ బహిరంగ సభలు నిర్వహించినా పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు ఎందుకు పడిపోయిందన్న దానిపై అధిష్టానం ప్రస్తుతం దృష్టి పెట్టింది. ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమవడం, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుండటంపై కాంగ్రెస్‌ అధిష్టానం ఆందోళన చెందుతోంది. దీనిపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల సమీక్షించారు.

పార్టీని చక్కదిద్దే పనిలో భాగంగా ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ ఇటీవల భేటీ అయ్యారు. సీనియర్ల మధ్య సమన్వయ లేమి, ఇటీవల కొందరు సీనియర్లను ఉద్దేశించి రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు, సోషల్‌ మీడియాలో సీనియర్లను టార్గెట్‌ చేస్తూ పెడుతున్న పోస్టులపైనా చర్చించినట్టు సమాచారం. ఉప ఎన్నికల్లో పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు వ్యూహాలు పనిచేయడకపోవడం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

ఉత్తర తెలంగాణలోని ఒక్కో ఉమ్మడి జిల్లాలో రెండేసి నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ పటిష్టంగా ఉందని.. మిగతాచోట్ల మూడో స్థానంలో నిలిచే పరిస్థితి ఉందని.. దీనికి కారణమేమిటనే దానిపైనా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే.. తెలంగాణ సీనియర్లతో తాను మాట్లాడుతానని ఖర్గే పేర్కొన్నట్టు తెలుస్తోంది. బీజేపీలోకి వలసలు మరింత పెరిగి నష్టం జరగకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఖర్గే భావిస్తున్నట్టు సమాచారం.

మాణిక్యం ఠాగూర్‌ను తప్పించే యోచన?
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు సీనియర్లు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌పై వరుసగా ఫిర్యాదులు చేస్తుండటాన్ని ఏఐసీసీ పెద్దలు పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆయనను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలనే యోచనలో ఏఐసీసీ ఉన్నట్టు సమాచారం. ఆయనను ఒడిశా రాష్ట్ర ఇన్‌చార్జిగా పంపుతారనే ప్రచారం జరుగుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement