వివాహంతోనే సమాజ శాంతి
చెన్నై: దంపతులకు, వారి వారసులకే కాదు, సమాజానికి శాంతి కలిగించడమే వివాహంలోని విశిష్టతని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు స్పష్టం చేశారు. దాంపత్య జీవితంలోని అశాంతి ఆ కుటుంబానికి తద్వారా సమాజానికి అశాంతి కలిగించి చేటుగా మారుతుందని ఆయన తెలిపారు. ‘వివాహ విశిష్టత’ అనే అంశంపై భారతీయ సాంస్కృతిక పీఠం (చెన్నై) వారి ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు చాగంటి వారి ప్రవచనాలు అద్భుతంగా సాగాయి. ముగింపు ప్రవచనాలు ఆయన మాటల్లోనే.
‘‘వివాహం ద్వారా దంపతుల జీవితంలో శాంతి ప్రారంభం కావాలి. శాంతి లేని నాడు ఒకరికి ఒకరు బరువు, ఈ సమాజానికే బరువుగా మారిపోతారు. భర్త ఉండడం భార్యకు శాంతి, భార్య ఉండడం భర్తకు శాంతి అదే వైవాహిక జీవితంలోని గొప్పదనం. వివాహ మహోత్సవంలో జీలకర్ర బెల్లం తలపై పెట్టడం, ఈ సమయంలో వధూవరుల మధ్యన తెరను పట్టుకోవడం, మెడలో మాంగల్యధారణ, తలంబ్రాలు ఇదంతా ఒక లౌకికమైన తంతుగా భావించరాదు. ప్రతి విధానం వెనుక ఒక మహోత్కృష్టమైన అర్థం ఉంది. జీలకర్ర ఆరోగ్యానికి మంచిది, బెల్లం నిల్వదోషం లేనిది. కలిపి దంచిన ఈ రెండింటినీ వధూవరులు ఒకరితలపై ఒకరు పెట్టుకున్నపుడు వారిద్దరి మధ్య త్యాగభావన, సద్భావన కలిగిస్తుంది. తెరదీయగానే ఒకరి నొకరు చూసుకోవడమే మంచి ముహూర్తం కింద లెక్క.
అందుకే మధ్యనున్న తెరపై స్వస్తిక్ ముద్ర వేయాలేగానీ తొంగితొంగి చూడమాక చందమామ’ వంటి పాటలు రాయరాదు. అలాగే మనిషి జీవితంలో మెదడు పాత్ర ఎంతో ముఖ్యమైనది, చెడు చేసినా, మంచిని ఆచరించినా మెదడే ప్రధానం. కష్టసుఖాలను గుర్తిస్తుంది, రాకుండా జాగ్రత్తలు చెబుతుంది. మెదడు చెప్పినట్లు దేహం, అందులోని అవయవాలు వింటాయి. దేహాన్ని, మెదడును కలిపే భాగం మెడ. అందుకే మంగళసూత్రాన్ని మెడలోనే కడతారు. బుద్ది అవయవాలు ఒకదానికి ఒకటిగా ఎలా నడుచుకుంటాయో వైవాహిక జీవితంలో మనిద్దరం అలా ఉందామని దంపతులు ఇద్దరూ మంగళసూత్ర ధారణతో చాటుకుంటారు.
అలాగే తలంబ్రాలు, ఏడు అడుగులు వేయడం ఒక ముచ్చటకాదు, ఎంతో విశిష్టమైనది. నీవులేని అయోధ్య నాకు అరణ్యంతో సమానమని సీతమ్మవారు అరణ్యవాసానికి రామునితో కదిలి వెళ్లారు. అంతటి త్యాగం భార్యలో ఉండాలి. ఒకరిపై ఒకరు చేసే విమర్శలను సహృదయంతో స్వీకరించాలి, ఒకరి బలహీనత మరొకరికి ప్రేమగా మారాలి, వృద్ధాప్యంలో తీపి గుర్తులుగా మిగలాలి. అలాగే ఒకరి బలహీనత ఒకరిని విడిచి వెళ్లడం, విడాకులు ఇవ్వడం మన దేశ సంస్కృతి కాదు. దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సర్దుకుపోవడమే ఈ దేశ గొప్పదనం. అలా జీవించినపుడే వివాహమైన కొత్తల్లోని ఆకర్షణ రోజు రోజుకీ తరగని అభిమానంగా మారి జీవితాంతం నిలబడుతుంది. దాంపత్య జీవితంలో భార్యా భర్తలు ఇద్దరూ సమానమే, ఎవరు ఎక్కువకాదు, తక్కువ కాదు.
వేర్వేరుగా మొదలై ఒకరికి ఒకరుగా జీవితాన్ని కొనసాగించి చివరకు ఆధ్యాత్మం పొందడం వివాహంలోని విశిష్టత. సాక్షాత్తు సీతారాములు, శివపార్వతులే దాంపత్య జీవితానికి ఆదర్శంగా నిలిచారు. వివాహ సమయంలో మంగళసూత్ర ధారణ కేవలం ఒక క్రతువుగా భావించరాదు. అది ఒక సర్వమంగళకారిణి. అందుకే మంగళసూత్రానికి ఎన్నడూ దోషం అంటదు. పురుషునికి యజ్ఞోపవీతం ఎంత పవిత్రమైనదో, స్త్రీకి మంగళ సూత్రం అంత పవిత్రమైనది. జీవిత కాలంలో మంగళ సూత్రానికి శౌచం, అశౌచం అనేవి ఉండవు. స్త్రీ తన జీవితంలో మంగళసూత్రాన్ని ఎవ్వరినీ తాకనివ్వదు. మహిళ మెడలో మంగళసూత్రం భర్త ఉన్నాడు అనేందుకు తార్కాణం. మంగళప్రదమైన మంగళ సూత్రంతో నేను నిండునూరేళ్లు హాయిగా జీవించాలనేది నీ చేతిలో ఉంది అని భర్త భావించగలగాలి.''