వాట్సాప్ ఆపింది పెళ్లిని..
పెళ్లికూతురికి అంతకు ముందే వివాహం
వాట్సాప్ ద్వారా పెళ్లికుమారుడికి తెలిసిన నిజం
కేకే.నగర్(చెన్నై): పెళ్లికూతురికి అంతకుముందే వివాహమైనట్లు వాట్సాప్ ద్వారా తెలియడంతో పెళ్లికుమారుడు వివాహాన్ని రద్దు చేశాడు. అనంతరం తనను మోసం చేశారని ఆరోపిస్తూ అతను పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు..ఆరణి సమీపంలోని సేవూర్ గ్రామానికి చెందిన మణి కుమారుడు మహేష్ (31). ఇతనికి ఆరణి ఎస్వీనగర్‌కు చెందిన యువతితో సోమవారం రాత్రి సేవూర్‌లోని కల్యాణ మండపంలో రిసెప్షన్ జరిగింది. ఆ సమయంలో ఆరణి దసరాపేటకు చెందిన వినాయకం నుంచి మహేష్ సెల్‌ఫోన్‌కు వాట్సాప్‌లో ఓ మెసేజ్ అందింది.
అందులో పెళ్లికూతురు, వినాయకం కలిసి దిగిన ఫొటోలతో పాటు తనకు, యువతికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగిందని తెలిపాడు. మహేష్ ఈ విషయాన్ని వెంటనే తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులను అడగ్గా వారు మౌనం వహించడంతో ఆగ్రహిం చిన పెళ్లికుమారుడు మహేష్ తనను మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో గతంలో వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి మోసం చేశారని. వివాహ ఏర్పాట్లకు తనకు రూ.5 లక్షలు ఖర్చు అయ్యిందని దాన్ని తిరిగి యువతి కుటుంబ సభ్యులు చెల్లించాలని కోరారు. పోలీసులు వాట్సాప్‌లో మెసేజ్ పంపిన వినాయకం కోసం గాలిస్తున్నారు.