ఇటీవల మాసబ్ ట్యాంకులో కలకలం సృష్టించిన కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
హైదరాబాద్:ఇటీవల మాసబ్ ట్యాంకులో కలకలం సృష్టించిన కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కొన్నిరోజుల క్రితం బ్యాంకు సీఈవో మన్మథ్‌దలాయ్ పై కాల్పులకు పాల్పడిన నిందితుల్ని రాజమండ్రికి చెందిన యువకులుగా గుర్తించారు. బ్యాంకు సీఈవో వద్ద డబ్బులుంటాయని భావించి వారు దోపిడీ యత్నం చేశారు. బ్యాంకు సీఈవో డ్రైవర్ సాయంతో ఆ యువకులు దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు.
గత ఆదివారం కృష్ణ భీమ సమృద్ధి లోకల్ ఏరియా (కేబీఎస్) బ్యాంక్ ఎండీ, సీఈవో మన్మథ్‌దలాయ్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. మాసబ్ ట్యాంక్‌లోని శాంతినగర్‌లో శ్రీదుర్గ కనుముల్లి అపార్ట్‌మెంట్‌లో మన్మథ్‌దలాయ్ తన కుటుంబంతో ఉండగా దోపిడీకి యత్నించిన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం కావడంతో మరికొన్ని రోజుల్లో సృష్టత వచ్చే అవకాశం ఉంది. సీఈవోపై కాల్పులు జరిపిన యువకులు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు సాగుతోంది.