=సవాళ్లు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొన్నాం
=మహిళలపై నేరాల కేసులు పెరిగాయి
=నగర కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: ‘జనవరి నుంచి డిసెంబర్ వరకు పండుగలు, ఉద్యమాలు, రాజకీయ కార్యకలాపాల బందోబస్తుల భారం నేపథ్యంలో కేసుల దర్యాప్తులో నగర పోలీసులు పూర్తిస్థాయి దృష్టి పెట్టలేకపోయారు. ఫలితంగానే రికవరీల శాతం గత ఏడాది కన్నా తగ్గింది’ అని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అన్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో శనివారం ఏర్పాటు చేసిన వార్షిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర పోలీసులకు సాధారణ డ్యూటీలకు అదనంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని అనురాగ్ శర్మ అన్నారు. నగర పోలీసు టెలిఫోన్ డెరైక్టరీతో పాటు క్యాలెండర్‌ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన నగరంలో నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేశారు.
ఆద్యంతం వీధుల్లోనే విధులు...
రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మార్చి 13 నుంచి డిసెంబర్ 19 వరకు మూడు దశల్లో 34 రోజులు జరిగాయి. చలోరాజ్‌భవన్, అ సెంబ్లీ తదితర పిలుపులు, వివిధ రాజకీయ పార్టీల సమావేశాలు, బహిరంగ సభలు, జనవరిలో వచ్చిన మిలాదున్‌నబీ నుంచి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వరకు వరుసపెట్టి బందోబస్తుల నేపథ్యంలో పోలీసులు అత్యధిక శాతం రోడ్లపైనే విధులు నిర్వర్తించాల్సి వచ్చింది.
కేసుల్లో తగ్గుదల...కొన్ని నేరాల్లో పెరుగుదల...
గతేడాది నగరంలో 18,744 కేసులు నమోదు కాగా... ఈ సంఖ్య ఈ ఏడాది 18,013గా ఉండి తగ్గుదల కనిపించింది. దోపిడీ, బందిపోటు దొంగతనం, ఇళ్లల్లో చోరీలు, దాడులు వంటి కేసుల్లో తగ్గుదల ఉన్నా... సాధారణ చోరీలు, కిడ్నాప్‌లు, లైంగికదాడులు పెరిగాయి. మొత్తమ్మీద ఈ ఏడాది రూ.42,66,50,191 విలువైన సొత్తు చోరీ కాగా... కేవలం రూ.16,30,84,642 మాత్రమే రికవరీ అయింది. గతేడాది రికవరీల శాతం 51.26 శాతం ఉండగా ఈ ఏడాది 38.22 శాతానికి పడిపోయింది.
మహిళలూ ముందుకొచ్చి ఫిర్యాదు...
సైబరాబాద్‌లో మహిళలు బాధితులుగా ఉన్న నేరాల సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరిగింది. 2012లో 1823 కేసులు నమోదు కాగా... ఈ ఏడాది 2124కు చేరింది. మహిళల్లో పెరిగిన అవగాహనతో పాటు పోలీసుస్టేషన్లలో లేడీ హోమ్‌గార్డుల్ని రిసెప్షనిస్టులుగా నియ మించడం తదితర చర్యల కారణంగా వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే ఈ సంఖ్యలో పెరుగుదల కనిపిం చిందని కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. సైబర్ నేరాల్లోనూ 360 శాతం పెరుగుదల న మోదు కావడానికీ అవగాహనే కారణమన్నారు.
సిబ్బంది సంఖ్యతో ఇబ్బందే...
నగర కమిషనరేట్‌కు కేటాయించిన పోస్టుల సంఖ్య 12,401 కాగా ప్రస్తుతం 8554 మందే అందుబాటులో ఉన్నారు. మిగిలిన 3847 (32 శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బందోబ స్తు, లా అండ్ ఆర్డర్ డ్యూటీలకు తోడు సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటంతో ఎన్నో ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల రిక్రూట్‌మెంట్ చేసుకున్న 2070 మంది అభ్యర్థులు మరో ఏడాదిలో శిక్షణ పూర్తి చేసుకుని వస్తే ఈ సమస్య కొంత వరకు తీరనుంది.
భద్రత కోసం సీసీసీ, సేఫ్ సిటీ ప్రాజెక్ట్...
నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సీసీఎస్ అధికారులు నేరాలు నిరోధించడానికి, కేసులు కొలిక్కితేవడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని కొత్వాల్ చెప్పారు. సిటీ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఏడాదిలో 41,579 ప్రాంతాల్లో తని ఖీలు చేయడంతో పాటు 43 బోగస్ ఫోన్‌కాల్స్ కూ స్పందించారన్నారు. భద్రతా చర్యల్లో భా గంగా నగర కమిషనరేట్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ఏర్పాటు చేసి నగరంలోని 335 సీసీ కెమెరాలతో అనుసంధానించామన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు కిందా అనేక ప్రతి పాదనల్ని కేంద్రానికి పంపామన్నారు.
తగ్గిన ప్రమాదాలు, మరణాలు...
నగర ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకుంటున్న చర్యల ఫలితంగా రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యా గణనీయం గా తగ్గిందని కమిషనర్ చెప్పారు. జరిమానా మొత్తాల్ని పెంచి వసూలు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడే వారి సంఖ్య తగ్గుతోంద న్నారు. ఈ ఏడాది మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిలో అత్యధికంగా 1181 మందికి జైలు శిక్ష పడిందని వివరించారు.
ఇదీ విజన్ 2014...
ప్రజలకు మరింత చేరువై, ఆశించిన విధంగా పని చేయడమే వచ్చే ఏడాది తమ లక్ష్యమని కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. నేరాల్ని త్వరిగతిన పరిష్కరించడం పైనే దృష్టి పెట్టామన్నారు. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు మతసామరస్యాన్ని కాపాడతామన్నారు. ప్రతి జోన్‌కు ఓ మహిళా ఠాణా ఉండేలా మరో రెండింటి కోసం ప్రయత్నిస్తామని, పెండింగ్‌లో ఉన్న కొత్త ఠాణాల ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొందటంపైనా దృష్టి పెడతామన్నారు.
బందోబస్తుల భారంతోనే రిక‘వర్రీ’లు
Published Sun, Dec 29 2013 5:41 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement