ఆశలు సమాధి చేసి..
ఎంసెట్‌లో కుమారుడు ఉత్తమ ర్యాంకు సాధిస్తే ఆ తల్లిదండ్రి ఆనందానికి అవధుల్లేవు.. ఇక తమ కుమారుడు డాక్టర్ అవుతాడని ఎంతో మురిసిపోయారు.. ప్రజలకు వైద్య సేవలందించి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తుంటే చూసి తరించిపోవాలనుకున్నారు.. కానీ.. సున్నిత మనస్తత్వానికి క్షణికావేశం తోడైంది.. ఇంకేముంది.. ఆ దంపతుల ఆశలను సమాధి చేస్తూ మెడికో యానాల సాయికుమార్‌రెడ్డి(19) భవనంపై నుంచి దూకి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
నల్లగొండ (నల్లగొండ క్రైం) : నల్లగొండ పట్టణంలోని మమత పాఠశాల కరస్పాండెంట్ యానాల ప్రభాకర్‌రెడ్డి రెండవ కుమారుడు సాయికుమార్‌రెడ్డి (19) సోమవారం రాత్రి బోయవాడ లక్ష్మీసాయి అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వార్త సంచలనం కలిగించింది. కుటుంబంతో పాటు అపార్ట్‌మెంట్ వాసులను, పరిచయమున్న వారందరినీ ఈ ఘటన కలిచివేసింది.
ఎంసెట్‌లో 167వ ర్యాంకు
ఈ ఏడాది ఎంసెట్-3లో సాయికి 167వ ర్యాంకు వచ్చింది. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైద్య కళాశాలలో సాయి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరారు. ఎంసెట్-2లో కూడా మెరుగైన ర్యాంకు రావడంతో తొలుత విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో జాయిన్ అయి తర్వాత మళ్లీ ఉస్మానియాలో చేరాడు. అయితే, చదువుల్లో మొదటి నుంచీ మంచి ప్రతిభ కనబర్చే సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్యకు కేవలం ఆత్మన్యూనతే కారణమని తెలుస్తోంది. ఎంబీబీఎస్‌లో సబ్జెక్టు అయిన అనాటమీ ప్రాక్టికల్స్ తాను ఆశించిన విధంగా లేకపోవడం, తన ఎత్తును దృష్టిలో ఉంచుకుని ప్రొఫెసర్లు ప్రాక్టికల్స్ జరుగుతున్న సమయంలో అతడ్ని వెనక నిలబడాలని ఆదేశించడం, తన వరకు ప్రాక్టికల్స్ రాకపోవడంతో సాయి మానసికంగా ఇబ్బంది పడ్డాడని, ఇదే విషయమై తన తండ్రితో కూడా చర్చించాడని తెలుస్తోంది.
ఆత్మన్యూనతే కారణమా
వాస్తవానికి సాయి మంగళవారం ఉదయం బయలుదేరి కళాశాలకు వెళ్లాల్సి ఉంది. అయితే, సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన తండ్రి యానాల ప్రభాకర్‌రెడ్డి తన కుమారుడు సాయిని కళాశాలకు వెళుతున్నావా అని అడగ్గా రేపు ఉదయం వెళతానని చెప్పాడని, తండ్రి దుస్తులు మార్చుకునేందుకు వెళ్లడంతో పరుగున ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడని తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన తండ్రి ఐదో అంతస్తు నుంచి కిందకు వెళ్లి, అంబులెన్స్‌కు ఫోన్ చేసి వైద్యసాయం అందించే లోపే ఘటనా స్థలంలోనే సాయి మృతిచెందాడు. అయినా, తల్లిదండ్రులు, మరో సోదరుడు కలిసి ఆశతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు మంగళవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సాయికి అంత్యక్రియలు జరిపారు.
ఇటీవల సన్మానం
కాగా గత ఆదివారం చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నీట్ పరీక్షపై బైపీసీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడిసిన్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆహ్వానించి సన్మానించారు. ఈ కార్యక్రమానికి సాయికుమార్‌రెడ్డిని కూడా ఆహ్వానించి సన్మానించడం గమనార్హం.