
పెళ్లికి ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి
కేకే.నగర్(చెన్నై): పెళ్లికి ముందు స్త్రీ, పురుషులు వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెన్నైకి చెందిన ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్‌లో తన భర్తకు బ్లడ్ కేన్సర్ ఉందని, పెళ్లికి ముందే అతనికి ఈ వ్యాధి ఉన్న విషయాన్ని దాచి తనకు 2014లో వివాహం జరిపించారని తెలిపింది. అతనితో కలిసి జీవించడం ఇష్టం లేని తాను విడాకులు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది. ఈ పిటిషన్ విచారణలో ఉండగా నా భర్త తమకు విడాకులు మంజూరు చేయొద్దని మరొక పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది.
ఈ రెండు పిటిషన్లపై ఈ న్యాయస్థానంలో విచారణ జరుగుతోందని, రెండు కేసులను కలిపి ఒకే న్యాయస్థానంలో విచారణ జరపడంపై ఆదేశాలు జారీచేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి కృపాకరన్ సోమవారం విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. అందులోని వివరాలు 24 సంవత్సరాల యువతిని మోసంచేసి వివాహం చేసినట్లు అభియోగం మోపింది. ఈ కేసులో సమర్పించిన ఆధారాలను బట్టి చూస్తే యువతి మోసానికి గురైనట్లు తెలుస్తోంది..
అందువలన ఆమె కోరినట్లు విడాకులు మంజూరు చేస్తున్నాం.. కుటుంబ సంక్షేమ కోర్టుకు ఈ కేసు పంపితే జాప్యం జరిగే అవకాశం ఉండడం వల్ల విడాకులను వెంటనే మంజూరు చేస్తున్నామని తెలిపారు. వివాహానికి ముందు తల్లిదండ్రులు నిజాలను తెలియజేయాలి. వివాహం చేసుకునే ముందు దంపతులయ్యే ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకోవాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.