ఎర్రకోటలో షాజహాన్ ‘కుమార్తెలు’
న్యూఢిల్లీ: ఈరోజు ఎర్రకోటను సందర్శించే వారికి మొఘల్ యువరాణులు జహాన్ ఆరా, రోషన్ ఆరాలను కలుసుకొనే అవకాశం లభించనుంది. సందర్శకులతో కనీసం ఒకగంట పాటు గడిపే మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమార్తెలు తరాలకు చెందిన వీరగాథలను మీతో పంచుకోనున్నారు. దివాన్-ఇ-ఖాస్‌లో ఆకస్మికంగా మీ మధ్యకు వచ్చి గంటసేపు సందర్శకులతో ఉంటారు. అయితే వీరు నిజంగా షాజహాన్ కుమార్తెలు కారు. నగర పౌరులకు చరిత్ర, వారసత్వ సంపదపై అవగాహనకల్పించేందుకు భారత పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ) ఈ ఏర్పాట్లు చేసింది.
ప్రపంచ వారసత్వ వారోత్సవాన్ని (నవంబర్ 19-25) పురస్కరించుకొని ఇద్దరు కళాకారులను ఏఎస్‌ఐ ఎంపిక చేసింది. మధ్యాహ్నం 2.30-3.30గంటల సమయంలో మొఘల్ కాలంనాటి దుస్తులను ధరించి వచ్చే ఈ కళాకారులు సందర్శకుల వద్దకు వచ్చి చరిత్రను వల్లెవేస్తారు. షాజహాన్ పెద్దకుమార్తె జహాన్ ఆరా బేగం సమాధి దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉంది. సోదరుడు ఔరంగజేబును సింహాసనం ఎక్కించడంలో కీలకపాత్ర పోషించిన రోషన్ ఆరా బేగం షాజహాన్ రెండో కుమార్తె. వీరిద్దరి పాత్రలను కళాకారులు ఎర్రకోటలో శనివారం నాడు ప్రదర్శించనున్నారు.