
జీవితాన్ని కాటేసిన పాము
కేకేనగర్ : పాలు పోసి పెంచినా పాము కాటేస్తుందనే విషయం అక్షరాలా నిజమైంది. పెంచుకున్న పాము యజమాని జీవితాన్నే కాటేసిన ఈ విషాద సంఘటన కడలూరు జిల్లాలో ఓ కుటుంబాన్ని అనాథగా మార్చిం ది. వివరాల్లోకి వెళితే.. ఏ జాతి పామైనా సరే నిమిషాల్లో పట్టుకుని రెండు వారాలు జాగ్రత్తగా పెంచి సురక్షితంగా ప్రాణాలతో అడవిలోకి వదిలే మహత్తరమైన పని చేసేవాడు పూనంచంద్(45).
అర్ధరాత్రైనా సరే పామును పట్టాలని ఫోన్‌కాల్ వచ్చిందంటే నిమిషాల్లో అక్కడికి చేరుకుని పని పూర్తి చేసి అందరి మన్ననలు పొందేవాడు. పూనంచంద్ పూర్వికులది రాజస్థాన్. కొన్నేళ్ల క్రితం కడలూరుకు వలస వచ్చిన పూనంచంద్ ఉపాధి కోసం పాములు పట్టే వృత్తిని ఎంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం విదిష్టను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
వీరికి గోవర్ధిని, గోముది అనే మూడేళ్ల కవలలు ఉన్నారు.ధనుశ్రీ అనే ఏడు నెలల చంటి బిడ్డ ఉంది. ప్రభుత్వ అనుమతితో పూనంచంద్ తాను పట్టే పాములను పాలు పోసి పోషించి, కొన్ని రోజులపాటు ఇంట్లోనే ఉంచుకుని అనంతరం వేప్పూర్‌లోని అడవుల్లో వదిలేసేవాడు. ఇతనికి కడలూరు కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ ప్రభుత్వ వాహనాలను ఇచ్చి పాములు పట్టడానికి, అడవుల్లోకి వదలడానికి సహాయం చేసేవారు. 19 సార్లు పాము కాటుకు గురైన పూనంచంద్ 18 సార్లు ప్రాణాలతో బయటపడ్డాడు.
అయితే 19వ సారి మాత్రం విషపూరితమైన కింగ్ కోబ్రా కాటుకు బలయ్యాడు. డిసెంబరు 15నుంచి తాబేళ్ల గుడ్లను సేకరించే పనిని అటవీ శాఖ అధికారులు పూనంచంద్‌కు కేటాయించి తాత్కాలిక వేతనం కింద నెలకు రూ. 5,500 ఇచ్చేవారు. ఇదిలాఉండగా ఈ మార్చి 15న మూడు ప్రాంతాల్లో పాములను పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. తర్వాత వాటిని భద్రపరుస్తున్న సమయంలో ఒక పాము అతని వీపు మీద కాటేసింది. స్పృహ తప్పిన పూనం చంద్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. పాములు పట్టే వృత్తికి జీవితాన్ని అంకితం చేసిన పూనంచంద్ జీవితం చివరికి ఆ పాము కాటుతోనే ముగిసింది. కుటుంబ పోషణకు చేతిలో చిల్లిగవ్వ లేక అతని భార్య, పిల్లలు నడిరోడ్డున పడ్డారు. తమను ఆదుకోవాలంటూ విదిష్ట శనివారం అధికారులకు వినతి పత్రాన్ని అందజేసింది.