మెట్రో చార్జీల పెంపు లేనట్టే!
Published Wed, Sep 4 2013 12:28 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
న్యూఢిల్లీ: వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో మెట్రో చార్జీలు పెంచే అవకాశాలు కనబడటం లేదు. చార్జీల పెరుగుదల గురించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఎన్నిసార్లు అభ్యర్థించినా పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. చార్జీల స్థిరీకరణ కమిటీ సభ్యులను ఇప్పటివరకు నియమించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఎస్కలేటర్ల కోసం వినియోగించే విద్యుత్ చార్జీలు పెరిగాయని, రైలు చార్జీల ధరలను సవరించాల్సిన అవసరముందని డీఎంఆర్‌సీ అధ్యక్షుడు మంగూ సింగ్ కనీసం మూడుసార్లు లిఖితపూర్వకంగా కోరారని చెప్పాయి.
ఇదిలావుండగా డీఎంఆర్‌సీ చట్టం కింద చార్జీల స్థిరీకరణ కమిటీకి నియమించాల్సిన ముగ్గురు సభ్యులను ఇంకా పట్టణ అభివృద్ధి శాఖ ఖరారు చేయలేదు. ఈ చట్టం కింద ఈ కమిటీ 90 రోజుల్లో నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఏ సమయంలోనైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశముండటంతో ఇప్పుడిప్పుడే చార్జీలు పెంచే అవకాశం మాత్రం కనిపించడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఈ చార్జీల స్థిరీకరణ కమిటీ సభ్యులు పనిచేస్తారని మాస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ డెరైక్టర్ ప్రకాశ్ సింగ్ తెలిపారు. చార్జీల పెరుగుదలకు ముందు వీరు విద్యుత్ వ్యయం, ఇతర ఆర్థిక స్థితిగతులను సమీక్షిస్తారని వెల్లడించారు.
‘ఎయిర్‌పోర్టు మెట్రో పనులపై సాధికార బృందాన్ని కలుస్తాం’
ఢిల్లీ ఎయిర్ పోర్టు మెట్రో మార్గానికి సంబంధించిన సమస్యలపై మంత్రుల సాధికార బృందం సలహాలు, మార్గదర్శనాలు చేయాలని పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరనుంది. వచ్చే రెండు, మూడు వారాల్లో ఆ బృందాన్ని కలుస్తామని నగరంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అభివృద్ధి మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. ఎయిర్ పోర్టు మెట్రో మార్గం గురించి సలహాలు, సూచనల కోసం సాధికార బృందంతో భేటీ కానున్నామని చెప్పారు. ఈ మార్గం నిర్మాణ పనుల నుంచి ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్, ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు తప్పుకోవడంతో డీఎంఆర్‌సీ ఆ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే.
Advertisement