విషాదం వీడని ఆఫ్రికా యువత
Published Tue, Jan 21 2014 11:23 PM | Last Updated on Thu, Mar 28 2019 6:23 PM
తాము మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యభిచారం చేస్తున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో తీవ్ర మానసిక క్షోభకు లోనైన స్థానిక ఆఫ్రికా యువత ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడడం లేదు. మంత్రి సోమ్‌నాథ్ భారతి తన అనుచరులతో కలిసి ఇటీవల ఖిర్కీలో అర్ధరాత్రి దాడులు నిర్వహించడం సంచలనం సృష్టించడం తెలిసిందే.
న్యూఢిల్లీ: న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఆధ్వర్యంలో ఐదు రోజుల క్రితం ఖిర్కీ మురికివాడలో నిర్వహించిన మెరుపుదాడులను తీవ్ర అవమానంగా భావిస్తున్న ఇక్కడి ఆఫ్రికా యువత ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతోంది. అయితే దక్షిణఢిల్లీలోని ఈ మురికివాడ మాదకద్రవ్యాలు, వ్యభిచార రాకెట్లకు కేంద్రంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. దాడుల సందర్భంగా మంత్రి ఆఫ్రికన్ యువతులపై అనుచితంగా ప్రవర్తించారని, వారి నుంచి బలవంతంగా మూత్రం సేకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఈ విదేశీయులు ఇప్పటికీ ఇళ్లకే పరిమితమవుతున్నారు. బయటికి వచ్చినా అపరిచితులతో మాట్లాడడానికి వెనుకంజ వేస్తున్నారు. కూలీనాలీ చేసుకునే వారికి నిలయమైన ఖిర్కీలో నైజీరియా, ఉగాండా దేశాలకు చెందిన యువతీ యువకులు అధికంగా కనిపిస్తారు. అయితే మంగళవారం మధ్యాహ్నం ఇక్కడికి వెళ్లిన విలేకరులకు అక్కడ నిర్మానుష్య వాతావరణం కనిపించింది. కొంతమంది వీధుల్లోకి వచ్చినా వారి ముఖాల్లో ఇప్పటికీ విషాదఛాయలు కనిపించాయి.
మీడియాతో మాట్లాడడానికి వాళ్లు ఎంతమాత్రమూ సుముఖత చూపలేదు. ఒకరిద్దరు మాట కలిపే ప్రయత్నం చేసినా మిగతావాళ్లు వద్దని వారించారు. మహిళలైతే అపరిచితుల ముఖాలు కూడా చూడడం లేదు. రోడ్డుపై కూరగాయాలు కొంటున్న ఆఫ్రికన్ యువతి వద్దకు విలేకరులు వెళ్లగానే ఆమె స్నేహితులు వెంటనే అక్కడికి చేరుకొని చేయిపట్టి లాక్కువెళ్లారు. భారతి అనుచరుల దాడుల్లో దొరికిన ఆఫ్రికన్ల ఫొటోలు, వీడియోలు దేశవిదేశీ మీడియాలో ప్రముఖంగా రావడంతో వీరు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. తాను 2010 నుంచి భారత్‌కు వస్తూ పోతున్నానని, అయితే ఇప్పటికీ ఆఫ్రికన్లను భారతీయులు గౌరవించడం లేదని ఎగ్బుల్లా కేనిస్ అనే నైజీరియన్ అన్నాడు. భారత్ విద్యాసంస్థలు భారీగా ఉపకారవేతనాలు ఇస్తుండడంతో ఆఫ్రికన్ యువత ఇక్కడే చదువు కోవడానికి ఆసక్తి చూపుతోంది. అద్దెలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఖిర్కీలో నివాసముంటారు. చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తుంటారు. ఇక్కడి వీధుల్లో మురికిగా, ఇరుగ్గా కనిపిస్తాయి.
చాలా ఇళ్లలో సూర్యకాంతి కనిపించదు. దేశవ్యాప్తంగా సుమారు 15 వేల మంది ఆఫ్రికన్లు ఉంటారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ‘మాపై వేధింపులు నానాటికీ అధికమవుతున్నాయి. ఆఫ్రికన్ దేశాల్లో ఎందరో భారతీయులు నివసిస్తున్నా అక్కడి వారికి ఎలాంటి సమస్యలూ ఉండవు. వాళ్లకు ప్రత్యేక హక్కులూ ఉంటాయి’ అని కేనిస్ వివరించాడు. ఇక్కడి భారీ ఎత్తున మాదకద్రవ్యాల రవాణా, వ్యభిచారం జరుగుతోందని తెలియడంతో దాడులు చేశామని మంత్రి సోమ్‌నాథ్ భారతి వివరణ ఇచ్చారు. ఖిర్కీలోని స్థానికులు కూడా మంత్రి ఆరోపణలను సమర్థిస్తున్నారు. ఆఫ్రికన్ల అక్రమాలను పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలోకి ఆఫ్రికన్ల తాకిడి ఎక్కువయ్యాక పరిస్థితులు అధ్వానంగా మారాయని రాజేశ్ కుమార్ అనే స్థానికుడు అన్నాడు. అందరూ మాదకద్రవ్యాల రవాణా, వ్యభిచారం చేయకున్నా కొందరి వల్ల మిగతా వాళ్లందరికీ ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపాడు. ‘ఖిర్కీ రాత్రిపూట బైకర్లు హల్‌చల్ చేస్తారు. మాకు ఇక్కడ రక్షణ లేదు అనిపిస్తోంది. రాత్రిపూట మా మహిళలు రోడ్లపైకి రావడానికే జంకుతున్నారు’ అని ధీరేన్ అనే మరో స్థానికుడు ఆన్నాడు.
Advertisement
Advertisement